ఏపీపై ఏకధాటి వర్షాలు.. లక్ష హెక్టార్లకుపైగా పంట నష్టం

By Jaswanth.T Sep. 27, 2020, 04:50 pm IST
ఏపీపై ఏకధాటి వర్షాలు.. లక్ష హెక్టార్లకుపైగా పంట నష్టం

ఆంధ్రప్రదేశ్‌పై వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. విడవని వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసిముద్దవుతోంది. జలాశయాలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు భారీగానే చేరుకుంటోంది. దాదాపే పదేళ్ళ కాలంలో ఎప్పుడూ చూడని రీతిలో పలు కాలువలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం వర్షాల ధాటి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పుడూ వర్షాలు ఉండే కోస్తా ఆంధ్రప్రాంతమే కాకుండా రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షధాటి కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.

పశ్చిమ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీతోపాటు, ఒడిస్సాపై కూడా ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోరెండు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలియజేస్తోంది. దీనికి తోడు తెలంగాణా, రాయలసీమ మీదుగా దక్షిణ కర్నాటక వరకు ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వివరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నుంచీ క్రిందికి భారీగానే నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సెప్టెంబర్‌ 24 వరకు వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రంలో 1,01,759 హెక్టార్లలో పంట నష్టం ఏర్పడినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 14,920 హెక్టార్లలోనూ, పశ్చిమగోదావరి జిల్లాలో 27, 421, కర్నూలులో 28,691, కడపజిల్లాలో 12,363, గుంటూరులో 8,537, అనంతపురం జిల్లాలో 2,918, ప్రకాశం జిల్లాలో 2,316, విశాఖ జిల్లాలో 15 హెక్టార్లలోనూ పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.

అయితే తాజాగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఏపీలోని అయిదు జిల్లాలపై ప్రధానంగా ఉందని, ఆ అయిదు జిల్లాల్లోనూ 13వేల హెక్టార్లకుపైగా పంటకు నష్టం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిలో ప్రధానంగా గుంటూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలపై ప్రస్తుత వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp