విశాఖ కార్పొరేషన్ లో పల్లా మాట వినేదెవరు ?

By Kalyan.S Jun. 07, 2021, 08:30 am IST
విశాఖ కార్పొరేషన్ లో పల్లా మాట వినేదెవరు ?

కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ బాబు ఇద్ద‌రూ వెళ్లి చెమ‌టోడ్చారు. ఊక‌దంపుడు ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ 98 స్థానాల‌కు గాను ఆ పార్టీకి 30 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఎన్నిక‌లు పూర్త‌యి ముచ్చ‌ట‌గా మూడు నెల‌లు కూడా పూర్తి కాలేదు కానీ, అప్పుడే టీడీపీ కార్పొరేటర్లలో ముసలం బయలుదేరింది. స‌రైన దిశా నిర్దేశం లేక ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారిలో కూడా అసంతృప్తి ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకు టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడ‌లు ఓ కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కరోనా కష్ట సమయంలో కూడా జీవీఎంసీ తీరు సమర్ధనీయంగానే ఉన్నా.. లేనిపోని ఆరోపణలు ఎక్కుపెట్టి నానాయాగీ చేయాలని పల్లా అదే పనిగా నగర కార్పొరేటర్లకు నూరిపోస్తూ వచ్చారు. ఇక టీడీపీ అధిష్టానం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఓ వారం రోజుల పాటు షెడ్యూల్‌ విడుదల చేసింది. దరిమిలా.. జీవీఎంసీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు, అధిష్టానం ఆదేశాలను అనుసరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పల్లా భావించారు. ఆ మేరకు శనివారం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.

కానీ సదరు సమావేశానికి ముగ్గురే ముగ్గురు కార్పొరేటర్లు హాజరయ్యారు. నలుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో నిజంగా లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ చీటీకి మాటికీ విమర్శలు, నిందారోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతామని ఓ సీనియర్‌ కార్పొరేటర్‌ చెప్పినా వినిపించుకోకుండా మీటింగ్‌ పెట్టారని అంటున్నారు. అందుకే ఆ మీటింగ్‌ను చాలా ’లైట్‌’ తీసుకున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అడ్డగోలుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేది లేదని తెగేసి చెప్పినట్టు స్పష్టం చేశారు. వాస్తవానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలను నియమించే బాధ్యత టీడీపీ అధిష్టానానిదే. కానీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పల్లా శ్రీనివాసరావు తన మేనల్లుడైన ప్రసాదుల శ్రీనివాస్‌ను నియమించుకోవడంపై ఆ పార్టీలోనే వివాదం రేగుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp