గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కన్నుమూత

By Srinivas Racharla Oct. 29, 2020, 04:01 pm IST
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్  కన్నుమూత

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) శ్వాసకోశ సంబంధ సమస్యతో కన్నుమూశారు. గత నెల సెప్టెంబర్‌లో ఆయన కరోనా వైరస్‌ బారిన పడినప్పటికీ తరువాత కోలుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పట్టడంతో కుటుంబ సభ్యులు అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి చికిత్సకు కూడా స్పందించని అంతగా క్షీణించటంతో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

1928లో జూలై 24న గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలోని విశవదార్‌ పట్టణంలో కేశూభాయ్ పటేల్ జన్మించారు.1945లో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో ప్రచారక్‌గా చేరారు. 1960లో జన్‌సంఘ్‌ వ్యవస్థాపక కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేశూభాయ్ ఎమర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు. 1977లో రాజ్‌కోట్‌ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన సంవత్సరానికి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బాబుభాయ్ పటేల్‌ ‘జనతా మోర్చ్‌’ ప్రభుత్వంలో చేరారు. బాబుభాయ్ క్యాబినెట్‌లో1978 నుంచి 1980 వరకు వ్యవసాయ మంత్రిగా సేవలందించారు.

1980లో జన్‌సంఘ్‌ రద్దయి భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు కేశూభాయ్ పటేల్ అందులో చేరారు. చిమన్‌భాయ్ పటేల్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంలో ఆయన 1990 మార్చి 4 నుండి అక్టోబర్ 25 వరకు గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. గుజరాత్‌లో వరుసగా రెండోసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి శూభాయ్ పటేల్ 14 మార్చి 1995 న ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటుతో ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యాడు.అయితే పటేల్ నేతృత్వంలోని బీజేపీ 1998 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి అధికారం చేజిక్కించుకుంది.దీంతో ఆయన రెండో పర్యాయం మార్చి 4, 1998 న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.కాగా అనారోగ్య కారణాలతో కేశూభాయ్ పటేల్ 2 అక్టోబర్ 2001 న ముఖ్యమంత్రి పదవికి మరోసారి రాజీనామా చేశారు.2002 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యని ఆయనకు అదే ఏడాది బీజేపీ రాజ్యసభ అవకాశం కల్పించింది.

2012లో బీజేపీను వీడిన కేశూభాయ్ పటేల్ సొంతంగా గుజరాత్ పరివర్థన్‌ పార్టీని స్థాపించారు. కానీ2014లో అనారోగ్య కారణంగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తన జిపిపి పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించిన కేశూభాయ్ అనారోగ్యం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp