ఎక్కడ పని చేసే వాళ్లు.. అక్కడే నివాసం ఉండాలి..

By Karthik P Nov. 23, 2020, 01:06 pm IST
ఎక్కడ పని చేసే వాళ్లు.. అక్కడే నివాసం ఉండాలి..

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తెచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంతృస్త స్థాయిలో అందించేందుకు గ్రామ, వార్డు సచివాయల అధికారులు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామం/ప్రాంతంలోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన ఇప్పటికే ఉన్నా.. ప్రస్తుతం వంద శాతం అమలు చేయాలని సర్కూలర్‌ జారీ చేసింది.

గ్రామ సచివాలయ ఉద్యోగులు సదరు సచివాలయం ఉన్న గ్రామంలోనూ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆ మున్సిపాలిటీ/ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేసింది. డివిజినల్, మండల స్థాయి అధికారులు.. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించింది. క్షేత్రస్థాయికి వెళ్లి ఎవరు స్థానికంగా నివాసం ఉంటున్నారు..? ఎవరు ఉండడంలేదన్నది తనిఖీ చేయాలని ఆ సర్కులర్‌లో పేర్కొంది. స్థానికంగా నివాసం ఉండని వారి జాబితాను పంపాలని ఆదేశించింది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నాటికి 1.30 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. మండలం స్థానికతగా పరిగణలోకి తీసుకుని.. వారికి స్థానిక మండలం పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టింగ్‌ ఇచ్చింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల్లో అత్యధిక శాతం తాము నివాసం ఉంటున్న గ్రామాలు/ ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేస్తుండడంతో.. వారందరూ నిర్ణీత వేళకు కార్యాలయాలకు వచ్చి, పని వేళలు ముగిసిన తర్వాతనే వెళుతున్నారు. తాజా నిర్ణయంతో అధికారులందరూ స్థానికంగానే నివాసం ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు పూర్తిస్థాయిలో అందుతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp