మూడు రాజధానుల మీద నేరుగా మాట్లాడండి...

By Guest Writer Jan. 21, 2020, 09:36 pm IST
మూడు రాజధానుల మీద నేరుగా మాట్లాడండి...

ఇక ముసుగులో గుద్దులాటలు లేవు, నాన్చుడు లేదు. ఎవరినీ బతిమాలాడాలూ, బుజ్జగించడాలూ లేవు. ఎవరెన్ని చేసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నది ఇక ఆఫీషియల్. విశాఖ - అమరావతి - కర్నూలు కేంద్రాలుగా పాలన, శాసనాలు/చట్టాలు, న్యాయం జరుగబోతున్నాయి. నెలకు పైగా సాగుతున్న నిరసనలు ఎటువంటి ప్రభావమూ చూపలేపోయాయి. రాజకీయేతర, ప్రజా/రైతు నిరసనగా జరుగవలసిన దానిని తెదేపా హైజాక్ చేసి దానిని రాజకీయంగా మార్చగా; ఆంధ్రజ్యోతి వంటివి దానికి కులం రంగు పులిమాయి. అమరావతి తన కల అని బాబుగారు పేర్కొనడం; ఇక ఎటువంటి విపత్తు సమయంలోనూ పెద్దగా బయటకు రాని భువనేశ్వరి గారు వంటివారు నిరసనల్లో పాల్గొనడం, విరాళాలు అందజేయడం వంటివి దీనిని బాబుగారి వ్యక్తిగత ఆరాటంతో కూడుకున్న పోరాటం స్థాయికి దిగజార్చాయి. దాంతో ఇది కేవలం కొన్ని గ్రామాల, ఒక్క వర్గపు ఆందోళనగా మిగిలింది అనే పేరు తెచ్చుకుంది.

మూడు రాజధానులు అన్నది కేవలం పదాల విన్యాసమే అన్నదానిలో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ, కనీసం ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమో లేక మరొకటో కానీ కర్నూలులో హై కోర్ట్ ఏర్పాటు కావడం సంతోషం. దీనివల్ల అభివృద్ధి జరుగుతుందా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది, ఇన్నాళ్ళకు ఆ ఒప్పందాన్ని కనీసం గౌరవించడమైనా జరిగింది. ప్రస్తుతమున్న పరిస్థితులలో అధికవ్యయం చెయ్యకుండా, పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం సమర్థనీయమే. అమరావతి ఏమవుతుంది అన్న ప్రశ్న అవసరం లేదు, వారు ఆశించినంత అయితే ఖచ్చితంగా జరుగదు - కానీ 2014 మరియు 2019 కి ముందు ఉన్నప్పటి కంటే ఖచ్చితంగా మెరుగైన స్థాయికి చేరుతుంది.

ఇక ఈ మూడు రాజధానులు లేదా పాలన/అభివృద్ధి వికేంద్రీకరణ అన్న ఈ విషయాన్ని ప్రతిపక్షాలకూ, ప్రజలకూ తెలియజేయడంలో ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగా లేదని అనుకుంటున్నాను. అమరావతి రైతుల పేరిట ఎవరైనా ధర్నా చేయవచ్చు గాక, వారి వెనుక ఎవరైనా ఉండవచ్చు గాక - నెలకు పైగా ఆందోళనలు సాగుతున్నప్పుడు కనీసం ఒక్కసారైనా ముఖ్యమత్రి లేదా తరఫు ప్రతినిధి వారిని కలిసి, వారికి న్యాయం చేస్తామని ఒక్కమాట చెప్పి ఉండవచ్చు. లేదా కనీసం వారి తరఫున కొందరు రాజకీయేతర ప్రతినిధులను కలిసి, తమ ఆలోచనను వారికి చేరవేసేలా చేసి ఉండవచ్చు. చాలా మంచి నిర్ణయాలు కూడా, కొన్ని తప్పటడుగుల వల్ల బెడిసికొట్టవచ్చు.

శాసనసభలో కానీ, బయట కానీ వైఎస్సార్సీపీ తీరు మూడు రాజధానులను వ్యతిరేకించేవారిని తెదేపా అభిమానులు/కార్యకర్తలు లేదా ఒక వర్గంవారు అనడం; అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగిందనడం; నాలుగేళ్ళలో అమరావతిలో ఏమీ జరుగలేదు అనడం ... ఇలా ఉంటోంది. అందులో అధికం నిజమే కావచ్చునేమో - కానీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇపుడు ప్రభుత్వం వికేంద్రీకృత సర్వతోముఖాభివృద్ధి కోసం అని చెబుతూ తీసుకున్న మూడు రాజధానులు అన్న నిర్ణయం ఎలా అన్ని ప్రాంలతాకు లాభసాటిగా ఉంటుందో; పాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ వంటి వాటికి వారు అమలులో ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు వంటివి వివరించే ప్రయత్నం చేయటం లేదు. నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు, వాటిని అమలు చేయడం ఒక ఎత్తు కాగా ఆ నిర్ణయాలు, వాటివల్ల కలిగే లాభాలు ఏమిటి అన్నది ప్రజలకు అర్థమయ్యేలా వివరించటం ఆ రెండింటిని మించిన పని. "ఇపుడు మనకు వోట్ వెయ్యని వారు కూడా, భవిష్యత్తులో మనకు వోట్ వేసేలా మనం చేసే పనులు ఉండాలి" అన్న జగన్ గారి పలుకులు ఆచరణలో చూపాలి. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారమే కాకుండా, ప్రజలకు తగిన సమాచారం ఇవ్వడం కూడా జరగాలి.

వాస్తవ పరిస్థితులను చూస్తే కర్నూలుకు జ్యూడిషియల్ కాపిటల్ అన్నది, కర్నూలుకు లేదా రాయలసీమకు ఉపయోగమే కానీ రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి వంటి సమస్యలను తీర్చేలా ఏవైనా చర్యలు చేపట్టాలి. అదే విధంగా రాయలసీమలో ప్రభుత్వ భూములు, బీడు భూములు ఎక్కువ. కాబట్టి రాయలసీమను ఇండస్ట్రియల్ కారిడార్ చెయ్యడం వంటి అంశాలను పరిశీలించాలి. సారవంతమైన, రెండుమూడు పంటలు పండే పొలాలను అభివృద్ధి మరియు నగరీకరణ పేరుతో నాశనం చేస్తూ, పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసేబదులు, ఇలాంటి ప్రత్యామ్న్యాయాలను పరిశీలించాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా. అలాగే కీలక నిర్ణయాల విషయంలో అన్ని పక్షాలనూ కలుపుకుపోయే తీరును అవలంబించాలి. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణల దిశగా మూడు రాజధానులు అన్నది తొలి అడుగు కావాలి కానీ ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోకూడదు.

Written By- Vamsi Kalagotla

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp