అప్పట్లో పార్టీ ఫిరాయించింది ఆ రాయల్టీ ఎగ్గొట్టేందుకే కానీ ఇప్పుడు తప్పేట్లు లేదు -- గొట్టిపాటి

By Sridhar Reddy Challa Feb. 15, 2020, 08:36 am IST
అప్పట్లో పార్టీ ఫిరాయించింది ఆ రాయల్టీ ఎగ్గొట్టేందుకే కానీ ఇప్పుడు తప్పేట్లు లేదు -- గొట్టిపాటి

తెలుగుదేశం హాయంలో ప్రభుత్వంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ లకు చెందిన గ్రానైట్ క్వారీలలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదుపై గత రెండు నెలలుగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ పరిధిలోని గ్రానెట్ క్వారీలలో సోదాలు జరిపిన రాష్ట్ర గనులు భూగర్భశాఖ ఉన్నతాధికారులు చీమకుర్తి పరిధిలో 35 క్వారీల్లో, బల్లికురవ పరిధిలోని 33 క్వారీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించారు. నిభందనలను అతిక్రమించిన సదరు క్వారీలకు పెద్దఎత్తున జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో ఆయా క్వారీల యజమానులకు నోటీసులు అందించడానికి రంగం సిద్ధమైంది.

గత కొంతకాలంగా క్వారీల అక్రమాలపై అధికారులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో కీలకపాత్ర పోషించిన శిద్దా రాఘవ రావు, గొట్టిపాటి రవి కుమార్, యరపతినేని శ్రీనివాసరావు, జివి ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు వంటి వారు తమ కుటుంబసభ్యులు, అనుచరుల పేరుతొ పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు లీజుకి తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వం హాయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులని బెదిరించి, నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున అక్రమతవ్వకాలు జరపడం, క్వారీల్లో తొవ్వి తీసిన రాయి కి తప్పుడు వే బిల్లులు సృష్టించి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి, ఉద్దేశపూర్వకంగా పన్నులు ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ.

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాలకు పాల్పడుతున్న గ్రానెట్ క్వారీలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో గత కొన్ని నెలలుగా ప్రకాశం జిలా పరిధిలోని చీమకుర్తి, బల్లికురవ ప్రాంతాలలోని క్వారీలపై పెద్దఎత్తున దాడులు జరిపి అక్రమాలకూ పాల్పడినట్టు గుర్తించి, పెద్దఎత్తున జరిమానా విధించిన 35 క్వారీల్లో ప్రధానంగా శిద్దా రాఘవరావు, గొట్టిపాటి రవి కుమార్ కుటుంబానికి, వారి అనుచరులకు చెందిన క్వారీలే ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం మొదలైంది.

అధికారులు జరిమానా విధించిన క్వారీలకి 1200 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. దీనిలో ఒక్క పెరల్ కంపెనీ పైనే 200 కోట్ల పెనాల్టీ విధించడం సంచలనంగా మారింది. ఇలా విడతల వారీగా నిన్నటి నుండి గనుల యజమానులకు నోటీసులు జారీచేస్తున్నారు. నిన్న కొంతమందికి నోటీసులు జారీచేయగా, ఈరోజు రేపు మరి కొందరికి నోటీసులు జారీ చెయ్యనున్నట్లుగా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శిద్దా రాఘవ రావు బంధువులు, సన్నిహితులు, వారి కుటుంబానికి అనుబంధంగా పనిచేస్తున్న 33 క్వారీలను అధికారులు గుర్తించారు. మొదట చీమకుర్తి పరిధి లోని గెలాక్సీ గ్రానెట్ కు నోటీసులు అందించిన తరువాత, బల్లికురవ, గురుజేపల్లి ప్రాంతాలలోని బ్లాక్ గ్రానైట్ క్వారీలకు నోటీసులు అందించనున్నట్టు తెలుస్తుంది.

గనులు భూగర్భ వనరులు శాఖ ఎడిషనల్ డైరెక్టర్ కార్యాలయం దగ్గరకొచ్చి నోటీసులు తీసుకోవాలని క్వారీ యజమానులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, కొంతమంది క్వారీ యజమానులు నోటీసులు తీసుకోవడానికి ఇష్టపడక అందుబాటులో లేకుండా బయటకి వెళ్లారని తెలుస్తుంది. అలాంటివారికి నోటీసులను నేరుగా క్వారీల కార్యాలయాల దగ్గరకెళ్ళి అందజేయనున్నట్టు గనులు, భూగర్భ వనురులు శాఖ అసిస్టెంట్ డైరెకర్ జగన్నాధరావు తెలిపారు. తనిఖీల్లో వెల్లడైన అక్రమాలు, లోపాలు ఆధారంగా పక్షపాతం లేకుండా ఈ నోటీసులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో గ్రానైట్ రాయల్టీని 15% పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ కావడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp