నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

By Karthik P Jun. 14, 2021, 09:30 pm IST
నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. ఈ నెల 12వ తేదీన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో.. ఆయా స్థానాలకు అధికార వైసీపీ తన పార్టీ నేతలను సిఫార్సు చేసింది.

గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడప జిల్లాకు సంబంధించి ఆర్‌వీ రమేష్‌యాదవ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కొయ్యే మోషేన్‌రాజులను గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు జాబితా పంపారు. సీఎం వైఎస్‌ జగన్‌ సిఫార్సులకు గవర్నర్‌ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు.

రాజకీయపరమైన అన్ని అంశాలు, సామాజిక సమతుల్యత, పార్టీలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నలుగురి పేర్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేసి ఒక సారి ఓడిపోయారు. 2019లో యేసురత్నం కోసం టిక్కెట్‌ను వదులుకున్నారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇంఛార్జిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి దక్కడంతో లేళ్ల అప్పిరెడ్డికి తగు న్యాయం జరిగినట్లైంది.

Also Read:బీద రవిచంద్ర.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..?

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్‌ రాజు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా నిర్వర్తించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడుగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన పని చేశారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రతిసారి అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారిపోతున్న మోషేన్‌రాజుకు ఈ సారి అవకాశం వరించింది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు పలు దఫాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జిల్లాలో కాపు సామాజికవర్గంలో త్రిమూర్తులు బలమైన నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2009 నియోజకవర్గాల పునః విభజనలో కొత్తగా ఏర్పడిన మండపేట నియోజకవర్గంలో టీడీపీ తరుపున వేగుళ్ళజోగేశ్వర రావ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో అక్కడ గెలవాలనే లక్ష్యంతో ఉన్న వైసీపీ తోటకు కో ఆర్డినేటర్‌గా పార్టీ బాధ్యతలు అప్పగించడంతోపాటు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

Also Read:నగదు బదిలీ పథకం మాదేనంటున్న యనమల.. నాటి పాలన గుర్తులేదా..?

ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఇటీవల ఎన్నికల్లో ఆర్‌వీ రమేష్‌ యాదవ్‌ గెలిచారు. చైర్మన్‌ పీఠం ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పదవి రమేష్‌కు దక్కలేదు. చైర్మన్‌ పీఠం ఆశించిన రమేష్‌కు.. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసి పెద్దల సభకు పంపింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp