ఈ సారి మూడు ‘సీ’లు

By Jaswanth.T Dec. 14, 2020, 07:13 am IST
ఈ సారి మూడు ‘సీ’లు

కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌ ఏపీలో కొత్తయేడాది తొలి నెలలోనే ప్రారంభమవ్వబోతోందని నిపుణుల తేల్చి చెప్పేసారు. జనవరి–మార్చి నెలల మధ్య ప్రాంభమయ్యే ఈ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిందిగా సవివరంగా సూచనలు అందజేసారు. మందులు, బెడ్‌లు, అత్యవసర చికిత్సా పరికరాలను సిద్ధం చేసుకునేందుకు తగిన ప్రణాళికలను సిద్ధంకావాల్సిందేనని ఖరాఖండీగానే చెబుతున్నారు. అయితే మొదటి వేవ్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు టెస్ట్, ట్రేస్, ట్రీట్‌మెంట్‌ విధానంలో మూడు ‘టీ’లను ఆధారంగా చేసుకుని ముందు సాగగా ఈ సారి మూడు ‘సీ’లను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. కాంటాక్ట్, క్లోజ్డ్, క్రౌడ్‌గా వీటిని చెబుతున్నారు.

ఫంక్షన్లు, పెళ్ళిల్లు, రాజకీయ కార్యక్రమాలు, వివిధ రకాల ప్రైవేటు ఈవెంట్లు తదితర రూపాల్లో జనం గుమిగూడడం ద్వారా భారీగా కోవిడ్‌ వైరస్‌ను ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేందుకు ఆస్కారం ఏర్పడుతోందని నిపుణులు సూచిస్తున్నారు. వీటినే సూపర్‌ స్పైడర్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెకెండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు వీటన్నిటిపైనా కఠిన ఆంక్షలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసారు.

తొలి విడత లాక్డౌన్‌ రీతిలో కాకపోయినప్పటికీ జనం గుమిగూడడం, ఒక చోటు నుంచి మరో చోటుకు భారీ తరలిపోవడం తదితర వాటిపై కఠిన నియంత్రణలకు సిద్ధమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. లాక్డౌన్‌ వెసులు బాట్లు నేపథ్యంలో జనం ఎక్కడిక్కడే విచ్చలవిడిగా మసలుతున్నారు. ఈ స్థాయి ఫ్రీనెస్‌ను కట్టడి చేయాల్సి ఉందని, లేకపోతే సెకెండ్‌ వేవ్‌తో ఇబ్బందులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

దేశంలోని కేరళ, ఢిల్లీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలను బేరీజు వేసి ప్రస్తుత అంచనాలకు వచ్చినట్లు చెబుతున్నారు. రోజుకు పదివేల పాజిటివ్‌లను గుర్తించడం దగ్గర్నుంచి ఇప్పుడు 300 వందలకే పరిమితం అయ్యింది. దీంతో సెకెండ్‌వేవ్‌కు అనుకూలంగా ఉండే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొన్న పరిస్థితులను పరిశీలించి, అందుకు అనుగుణగా చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. రిస్క్‌ఫ్యాక్టర్‌ ఎక్కువగా ఉండే వారిని బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా కట్టడి చేసేందుకు కూడా చర్యలుచేపట్టనున్నారు.

సెకెండ్‌వేవ్‌ భారి నుంచి తప్పించుకోవడానికి కూడా మాస్క్‌ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడమే కీలకంగా చెబుతున్నారు. లాక్డౌన్‌ మాదిరిగా పూర్తిస్థాయిలో జన సమూహాలను నియంత్రించే పరిస్థితి లేనందున పరిమిత స్థాయిలో ఏర్పాటు చేసే నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాల్సి ఉంటుందంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp