క్రీడాకారులకు గుడ్ న్యూస్-టోక్యో ఒలింపిక్స్‌ కొత్త షెడ్యూల్‌ విడుదల

By Srinivas Racharla Jul. 18, 2020, 08:13 pm IST
క్రీడాకారులకు గుడ్ న్యూస్-టోక్యో ఒలింపిక్స్‌ కొత్త షెడ్యూల్‌ విడుదల

కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రీడాకారులకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) శుభవార్త చెప్పింది.వైరస్ విజృంభణతో ఏడాదిపాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ కొత్త షెడ్యూల్‌ను ఇవాళ టోక్యో క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి,సీఈవో టొషిరో ముటో విడుదల చేశారు.

ఆరంభ ఉత్సవాలు మొదలుకొని పలు క్రీడా పోటీలు జరిగే వేదికలు,తేదీలను శుక్రవారం టోక్యో క్రీడల నిర్వహణ కమిటీ విడుదల చేసింది.అయితే ఆరంభ వేడుకలకు ముందే జూలై 22న పురుషుల ఫుట్‌బాల్‌,మహిళల సాఫ్ట్‌బాల్‌,23న ఆర్చరీ,రోయింగ్‌ పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. కాగా విశ్వ క్రీడల కోసం అత్యున్నత సదుపాయాలతో 42 వేదికలను సిద్ధం చేశారు.
నూతన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలై 23న ప్రధాన స్టేడియంలో విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు జరుగుతాయి.ఆరంభ వేడుకల అనంతరం 2021 జూలై 24న తొలి మెడల్‌ ఈవెంట్‌గా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో పోటీ జరగనుంది.

అలాగే అదే రోజు (జూలై 24)న పూల్‌-ఎ లోని భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో పురుషుల హాకీ పోటీలు ప్రారంభమవుతాయి.పూల్‌-ఎలో భారత్‌తో పాటు ఆతిథ్య జపాన్‌,ఆస్ట్రేలియా, అర్జెంటీనా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌ ఉన్నాయి. పూల్‌-బిలో బెల్జియం, నెదర్లాండ్స్‌, జర్మనీ, బ్రిటన్‌, కెనడా, దక్షిణాఫ్రికా తలపడతాయి. పురుషుల హాకీ ఫైనల్ ఆగస్టు 5న జరగనుంది.కాగా మన్‌ప్రీత్‌సింగ్‌ నాయకత్వంలోని భారత్‌ జులై 25న ఆస్ట్రేలియాతో, జులై 27న స్పెయిన్‌తో, జులై 29న ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో, 30న జపాన్‌తో తలపడనుంది.

ఇక మహిళల విభాగం పూల్‌-ఎలో భారత్‌తో పాటు, నెదర్లాండ్స్‌, జర్మనీ,బ్రిటన్‌, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా పూల్‌-బిలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా,న్యూజిలాండ్‌, స్పెయిన్‌, చైనా, జపాన్‌ ఉన్నాయి.తమ తొలి మ్యాచ్‌లో భారత మహిళ జట్టు నెదర్లాండ్స్‌తో జూలై 25 న తలపడనుంది. ఆరంభ మ్యాచ్‌ తర్వాత జూలై 26 న జర్మనీతో, జూలై 28 న గ్రేట్‌ బ్రిటన్‌తో,జూలై 29 న అర్జెంటీనాతో, జూలై 30 న జపాన్‌తో రాణీ రాంపాల్‌ సేన తలపడనుంది. ఆగస్టు 6 న జరిగే మహిళల ఫైనల్‌తో ఒలింపిక్స్‌లో హాకీ మ్యాచ్‌ల షెడ్యూల్ ముగుస్తుంది.

ఒలంపిక్స్ వాయిదాతో డీలా పడిన క్రీడాకారులలో టోక్యో ఒలంపిక్స్ నిర్వహణ కొత్త తేదీల ప్రకటన నూతనోత్సాహం నింపుతుంది అనడంలో సందేహం లేదు. ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న క్రీడాకారులు తిరిగి తమ ప్రాక్టీసును మొదలు పెట్టే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp