గాడ్సే ఒక దేశభక్తుడు--ప్రగ్యా సింగ్

By Kiran.G Nov. 28, 2019, 01:52 pm IST
గాడ్సే ఒక దేశభక్తుడు--ప్రగ్యా సింగ్

మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే ఒక దేశభక్తుడు. ATS ఛీఫ్ హేమంత్ కర్కరే తనను కేసులో ఇరికించిన శాపం వల్లనే చనిపోయాడు. బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని దాన్ని కూల్చివేసినందుకు గర్వంగా ఉంది. బీజేపీ నాయకుల వరుస మరణాలలో ప్రతిపక్షాల కుట్ర ఉంది. అందుకోసం ప్రతిపక్షాలు క్షుద్రశక్తుల్ని ఉపయోగిస్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ ఒక టెర్రరిస్ట్.. ఇవన్నీ మతిస్థిమితంలేని వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు కావు. మాలెగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయి బెయిల్ పై బయటకొచ్చి గత ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన వివాదాస్పద నేత సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ వివిధ సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివి. పలు సందర్భాల్లో సాధ్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీ పార్టీ ఇరకాటంలో పడింది. ఇప్పుడు కూడా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను పార్లమెంట్ సాక్షిగా ప్రగ్యా సింగ్ చేయడం వివాదస్పదమైంది.

లోక్ సభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు గాడ్సే గాంధీని ఎందుకు హత్య చేసాడనే ప్రస్తావన వచ్చింది. డీఎంకే ఎంపీ రాజా ఈ ప్రశ్నను లేవనెత్తగా దానికి స్పందించిన ప్రగ్యా సింగ్ ఠాకూర్ గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ప్రగ్యాసింగ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నామని స్పీకర్ తెలిపారు. ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్షాలన్నీ సభనుండి వాకౌట్ చేసాయి. దీనితో బీజేపీ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. శీతాకాల సమావేశాల నుండి ప్రగ్యా సింగ్ ను బహిష్కరించామని బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు.అలాగే, రక్షణశాఖకు సంబంధించి పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రగ్యా సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా జెపి నడ్డా తెలిపారు.

ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ భారత పార్లమెంట్ చరిత్రలో అత్యంత దుర్దినంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రగ్యా సింగ్ మొదట్నుంచి గాంధీకి వ్యతిరేకని అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కీలకమైన రక్షణ సంబంధ కమిటీలో సభ్యురాలిగా నియమించడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ విమర్శించింది. ఈ చర్య దేశ రక్షణ దళాలు, గౌరవనీయ పార్లమెంటు సభ్యులు, ప్రతి భారతీయుడికి అవమానకరమని పేర్కొంది. గతంలో కూడా గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ ప్రగ్యా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp