చేతులు మారిన కాకినాడ సెజ్, కొత్త యాజమాన్యం చేతుల్లో ముందడుగు పడుతుందా?

By Raju VS Sep. 26, 2020, 09:47 am IST
చేతులు మారిన కాకినాడ సెజ్, కొత్త యాజమాన్యం చేతుల్లో ముందడుగు పడుతుందా?

ఏపీలో పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్సార్ చేపట్టిన పలు ప్రత్యేక ఆర్థికమండళ్లు ఇప్పుడు కీలకంగా మారాయి. పారిశ్రామిక కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. శ్రీ సిటీ నుంచి అచ్యుతాపురం సెజ్ వరకూ గత 15 ఏళ్ల కాలంలో వచ్చిన పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. కానీ కాకినాడ సెజ్ మాత్రం ముందుకు వెళ్లడం లేదు. అత్యంత భారీ ప్రాజెక్ట్ గా ఏకంగా 10వేల ఎకరాలు సేకరించినా పట్టుమని పది పరిశ్రమలు కూడా ఇప్పటి వరకూ రాలేదు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా కాలు పెట్టింది లేదు. దాంతో పదేళ్లకు పైగా ఆ భూములన్నీ ఖాళీగా పడావుగా మారిపోయాయి.

వైఎస్సార్ అనంతరం వరుసగా ప్రభుత్వాలన్నీ కాకినాడ సెజ్ మీద దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కాకినాడ అప్పటికే పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతమే అయినా దానికి అనుగుణంగా అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయలేదు. దాంతో పాల్స్ ఫల్స్ అనే చైనీస్ బొమ్మల కంపెనీ మినహా మరో పరిశ్రమ ఏర్పాటయిన దాఖలాలు లేవు. ఇక గేట్ వే పోర్ట్ నిర్మాణం కూడా ముందడుగు పడలేదు. తొలుత కేవీ రావు పేరు మీద భూ సేకరణ జరిగింది. ఆ తర్వాత దానిని జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. తాజాగా జీఎంఆర్ తనకు చెందిన 51 శాతం వాటాను విక్రమయించింది. అరబిందో గ్రూపునకు విక్రయించింది.

మొత్తం రూ. 2610 కోట్లకు గానూ తొలుత రూ. 1600 కోట్లు చెల్లిస్తారు. ఆతర్వాత రాబోయే మూడేళ్లలో మిగిలిన మొత్తం చెల్లించేందుకు జీఎంఆర్, అరబిందో మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో కాకినాడ సెజ్ లో 51 శాతం వాటాతో పాటుగా గేట్ వే పోర్ట్ నిర్మాణానికి సంబంధించి 100 శాతం అరబిందోకి దక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికయినా కాకినాడ సెజ్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా జీఎంఆర్ సంస్థ తన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు పలు కంపెనీలు అమ్మకానికి పెట్టగా, కొత్త యాజమాన్యం ఇప్పటికే పలు రంగాల్లో సక్సెస్ సాధించిన నేపథ్యంలో కాకినాడ సెజ్ కూడా కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాకినాడ సెజ్ ని ఆనుకుని కొన్నేళ్ల క్రితం దివీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీ కోసం ప్రయత్నం చేసింది. అప్పట్లో దానికి వ్యతిరేత రావడంతో చంద్రబాబు విరమించుకున్నారు. ప్రస్తుతం తూగోజిల్లా లో బల్క్ డ్రగ్ యూనిట్ నిర్మాణం చేయాలని ఏపీ క్యాబినెట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ పరిధిలో అలాంటి ప్రాజెక్టులకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే విశాఖ-కాకినాడ పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన జగన్ హయంలో కార్యరూపం దాల్చినట్టవుతుందని చెప్పవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp