గ్రేట‌ర్ వార్ : సెటిల‌ర్లు ఎటువైపు..?

By Kalyan.S Nov. 29, 2020, 09:30 pm IST
గ్రేట‌ర్ వార్ : సెటిల‌ర్లు ఎటువైపు..?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఇప్పుడు రాష్ట్రానికే ప‌రిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి అగ్ర నేత‌లు త‌ర‌లిరావ‌డం, తూటాల్లాంటి మాట‌ల‌తో ప్ర‌సంగాలు చేయ‌డంతో అంద‌రి చూపూ గ్రేట‌ర్ పైనే ప‌డింది. ఈ ద‌శ‌లో ప్ర‌తి ఒక్క ఓటు కోసం కూడా టీఆర్ఎస్, బీజేపీ విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సెటిల‌ర్లు ఎవ‌రికి మ‌ద్దతు ఇస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 150 డివిజ‌న్ల గ్రేట‌ర్ లో దాదాపు 40 డివిజ‌న్ల‌లో సెటిలర్లు ప్రభావం చూపనున్నారు. మొత్తం 24 అసెంబ్లీ సెగ్మెంట్లు గ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో స్వల్ప హెచ్చుతగ్గులతో దాదాపు సగం వరకు నియోజకవర్గాల్లో సెటిలర్లు గెలుపు, ఓటములును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇది సాధారణ ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైంది. మేయ‌ర్ పీఠం కోసం ఇచ్చే తీర్పులో వీరి భాగ‌స్వామ్యం అధికంగా ఉన్న నేప‌థ్యంలో పార్టీల‌న్నీ వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

ఏపీ వారే కాకుండా...

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాస్తవానికి, కేవలం ఆంధ్రప్రదేశ్‌ మూలాలు కలిగిన వారే కాకుండా, మార్వాడీలు, మరాఠీలు, బెంగాలీలు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు ఇక్క‌డ నివాసం ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ మూలాలు కలిగిన వారిని ఉద్దేశించి సెటిలర్లు అనే పదం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఒకానొక సంద‌ర్భంలో అది వివాదాస్ప‌ద‌మైంది కూడా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెల్చుకొని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టినా.. గ్రేటర్‌ పరిధిలో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం మూడు స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. కాంగ్రెస్‌ నామమాత్రంగా మిగిలితే, టీడీపీ-బీజేపీ కూటమిది పైచేయి అయింది. కానీ.. రెండేళ్ల కాలంలోనే గ్రేట‌ర్ లో రాజ‌కీయంగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. 2016లో జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సైతం టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం సృష్టించింది. 99 స్థానాల్లో విజ‌య‌బావుటా ఎగురువేసింది. అప్పుడు బీజేపీ కేవ‌లం నాలుగు స్థానాల‌కే ప‌రిమితం అయింది. టీడీపీ ఒకే ఒక్క స్థానంతో స‌రిపెట్టుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాల‌ను సాధించింది. 2014 ముందు వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిన ఆ ప్రాంత‌వాసులు 2016 గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అధిక మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ‌..

గ‌త ఎన్నిక‌ల స‌ర‌ళిని ప‌రిశీలిస్తే.. గ్రేటర్‌ పరిధిలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, పటాన్‌చెరు, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సెటిలర్ల ప్రభావం ఎక్కువ ఉంది. వారి తీర్పుపైనే ఆయా పార్టీల అభ్య‌ర్థుల గెలుపోట‌ములు ఆధార‌ప‌డ్డాయి. ఆ తర్వాత దశలోకి సనత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, అంబర్‌పేట వస్తాయి. ఇక ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, వారంతా ఉన్నత వర్గాలకు చెంది ఉండటం వల్ల ‘గ్రేటర్‌’ ఓటింగ్ శాతం అక్క‌డ త‌క్కువ‌గా న‌మోద‌వుతోంది. ఈ నేప‌థ్యంలో వివిధ పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటూ, అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2016 ఎన్నిక‌ల ప‌రిస్థితే ఇప్పుడు ఉందా.. అంటే స్ప‌ష్టంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ ఎన్నిక‌ల్లో వ‌ర‌ద సాయం పంపిణీ కూడా ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. కూక‌ట్ ప‌ల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి ప్రాంతాల్లో వ‌ర‌ద స‌హాయం చాలా మందికి అంద‌లేదు. దీంతో టీఆర్ఎస్ పై కొంత మంది అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇది ఓట్ల‌పై ప్ర‌భావం చూపుతుందా..? ‌లేదా..? అనేది చూడాలి.

కీల‌కంగా ఏపీ రాజ‌ధాని అంశం

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌ధాని అమరావతి అంశం కూడా కీలకంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సీమాంధ్రులు ఎక్కువ‌గా ఉన్న ఈ ప్రాంతంలో ఏపీ రాజ‌ధాని అంశాన్ని కూడా వారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌న్నవాద‌న జ‌రుగుతోంది. మూడు రాజ‌ధానుల అంశంలో బీజేపీ స్టాండ్ ఏంటో స్ప‌ష్టంగా చెప్పాల‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. టీఆర్ఎస్ నేత‌లు కూడా రాజ‌ధాని అంశంపై మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో, ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.. కేంద్రాన్నివిమర్శిస్తూ ఏపీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. గత ఏరేండ్లుగా మోడీ సర్కార్ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అమరావతి నిర్మాణానికి కూడా చిల్లిగ‌వ్వ ఇవ్వ‌లేద‌ని విమర్శిస్తున్నారు. సీమాంధ్రుల ఓట్ల కోసమే కేటీఆర్ ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మ‌రో వైపు మూడు రాజ‌ధానుల అంశాన్ని కూడా సీమాంధ్రులు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో సెటిల‌ర్లు ఎటువైపు మొగ్గుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp