గ్రేట‌ర్ వార్ : "స్టార్స్'' లేని టీడీపీ

By Kalyan.S Nov. 25, 2020, 07:52 am IST
గ్రేట‌ర్ వార్ : "స్టార్స్'' లేని టీడీపీ

గ్రేటర్ పీఠం సాధించేందుకు పార్టీల‌న్నీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ప్ర‌ధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ తీవ్రంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు గ‌తంలో జీహెచ్ఎంసీ పై జెండా ఎగుర‌వేసిన కాంగ్రెస్ ఈసారి కూడా పోటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు, స్టార్ క్యాంపెయిన‌ర్స్ రోడ్ షోలు, పాద‌యాత్ర‌ల‌తో దూసుకెళ్తుంటే మ‌రో పార్టీ తెలుగుదేశం లో విచిత్ర ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 106 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన‌ప్ప‌టికీ వారి త‌ర‌ఫున నిల‌బ‌డి పోరాడేవారు క‌రువ‌య్యారు. నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినీ మిన‌హా ఎవ్వ‌రూ ప్ర‌చారంలో క‌నిపించ‌డం లేదు.

ఐదు రోజులే గ‌డువు

ఈ సారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల షెడ్యూల్ ను బాగా కుదించారు. ప్ర‌చారానికి ఇక ఐదు రోజులే గ‌డువు ఉంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ సహా బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్‌ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తూనే స్మార్ట్‌ఫోన్‌లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు.

దూసుకు పోతున్న కేటీఆర్

టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే డివిజన్ల వారీగా రోడ్‌ షోలు నిర్వహిస్తోంది. మంత్రి కేటీఆర్‌ ప్రచారంలో ప్రధాన స్టార్‌గా దూసుకుపోతున్నారు. మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పది పదిహేను డివిజన్లకు తగ్గకుండా రోడ్‌షోలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఒక్కో డివిజన్‌కు మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో డివిజన్ ను చుట్టు ముడుతూ ప్రజల్లో కలియ తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ఇలా..

గ్రేటర్‌లో పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. అభ్యర్థుల గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి సహా పలువురు నేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్, బీజేపీలను ఎండగడుతున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించడం, కార్యకర్తలు చేజారకుండా కాపాడుకోవడం వీరికి తలకుమించిన భారంగా మారింది. మ‌రో వైపు ఎంఐఎం నుంచి అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆ పార్టీ అభ్యర్థుల తరపున పాతబస్తీలో ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా డోర్‌ టు డోర్‌ వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు.

జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో బీజేపీ..

అధికార పార్టీ దూకుడుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిపక్ష బీజేపీ కూడా ప్రచారం నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. నగరంలోని ఉత్తరాది రాష్ట్రాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల నుంచి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఐటీ విభాగం కార్యకర్తలను నగరానికి రప్పించింది. డివిజన్‌కు కనీసం పది మంది సభ్యులకు తగ్గకుండా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ఇన్‌చార్జి భూపేందర్‌ యాదవ్‌ సహా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ సహా పలువురు నేతలు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూనే మరో వైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు.

నాయ‌కుడు లేని నావ‌లా టీడీపీ

మిగ‌తా పార్టీల‌న్నీ మ‌హా మ‌హుల‌తో ప్ర‌చారం చేయిస్తూ ప్ర‌జాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయా అభ్య‌ర్థులే గెలుపు కోసం ఆరాట‌ప‌డుతున్నారు. ఎవ‌రికి వారే అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. అన్నీ వారే స‌మ‌కూర్చుకుంటున్నారు. క‌నీసం త‌మకు మ‌ద్ద‌తు నిలిచి ప్ర‌చారంలో పాల్గొనేందుకు నేత‌లెవ్వ‌రూ ఇంత వ‌ర‌కూ రాలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుహాసిని మాత్రం కొన్ని చోట్ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ప్ర‌చారానికి ఇక ఐదు రోజులే గ‌డువు ఉండ‌డంతో ఎవ‌రెవ‌రు రంగంలోకి దిగుతారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp