గ్రేటర్‌ వార్‌ : ఇప్పించుకున్నారు.. మరి గెలిపించుకుంటారా..?

By Kalyan.S Nov. 23, 2020, 09:35 am IST
గ్రేటర్‌ వార్‌ : ఇప్పించుకున్నారు.. మరి గెలిపించుకుంటారా..?

ఎన్నికల నగారా మోగినప్పటి నుంచీ జీహెచ్‌ఎంసీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ గ్రేటర్‌లో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనే ఆచితూచి వ్యవహరించింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సర్వేలను పరిగణనలోకి తీసుకుని 27 మంది సిట్టింగ్‌లను పక్కన పెట్టింది. ఇదంతా ఒకటైతే.. పాత వారిని పక్కనబెట్టడంలోనూ, నిలుపుకోవడంలోనూ కొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. తమను నమ్మిన, తమకు నచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇప్పించుకున్నారు. వారికిప్పుడు అసలు టెన్షన్‌ మొదలైంది. పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకున్న స్థానాలను గెలిపించుకునే బాధ్యత వారిదే కావడంతో అభ్యర్థుల వెన్నంటి ఉండి గెలుపు బాధ్యతను కూడా భుజాన వేసుకున్నారు కొందరు నేతలు.

సిట్టింగ్ ల‌ను కాద‌ని..

నగర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు పద్మారావు గౌడ్‌. తన నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో తాను చెప్పిన వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉండగా.. నలుగురు సిట్టింగ్‌లను పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో వారిని సిఫార్సు చేసింది కూడా ఆయనే. కానీ ఈసారి మాత్రం వారిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్‌ ఇప్పించారు. బౌద్ధనగర్‌, మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్లు ధనంజనగౌడ్‌, బి.ఎన్‌.భార్గవి, విజయకుమారి, ఆలకుంట సరస్వతిల స్థానంలో కొత్త వారు పోటీలో ఉన్నారు. సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమకు మాత్రమే మళ్లీ అవకాశం కల్పించారు. దీంతో ఆ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పద్మారావు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో..

మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకం. ఈ ఏడాది జనవరిలో జరిగిన బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లలో టీఆర్‌ఎస్‌ ఆశించిన స్థానాలను సాధించలేదు. మేయర్‌ పీఠాలను అయితే సొంతం చేసుకున్నారు కానీ.. దాని కోసం ఇతర పార్టీలు, స్వతంత్రులను మచ్చిక చేసుకుని పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి ఆ పరిస్థితి రాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో ఎలాగైనా టీఆర్‌ఎస్‌కు అధిక స్థానాలను సాధించాలని ప్రయత్నిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో కూడా తనదైన ముద్ర ఉండేలా చేసుకున్నారు. దీంతో వారిని గెలిపించుకునే బాథ్యత సబిత భుజాన వేసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని తపిస్తున్నారు. అలాగే... స‌న‌త్ న‌గ‌ర్ నియోజక‌వ‌ర్గంలోని డివిజ‌న్ల‌లో టికెట్ల కేటాయింపులో మంత్రి త‌ల‌సాని కీల‌క పాత్ర పోషించారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో మాగంటి గోపీనాథ్ కూడా త‌న మాట నెగ్గించుకుని న‌చ్చిన వారికే టికెట్లు ఇప్పించుకుని వారి గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇత‌ర పార్టీల‌లోనూ..

టీఆర్ఎస్ లోనే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా టికెట్ల కేటాయింపుల‌లో ప్ర‌ముఖ నేత‌లు చ‌క్రం తిప్పారు. గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే త‌న మాట నెగ్గించుకోవ‌డానికి అధిష్ఠానంతో ఓ ర‌కంగా యుద్ధం చేసిన‌ట్లు విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగ‌ళ్ హాట్, జాంబాగ్ డివిజ‌న్లు ఓకే కానీ, గోషామ‌హ‌ల్, గ‌న్‌ఫౌండ్రి, బేగంబ‌జార్ డివిజన్ల విష‌యంలో ర‌చ్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ లో కూడా కొన్ని చోట్ల టికెట్ల కోసం పోటీ ఏర్ప‌డింది. ఆయా నేత‌లు త‌మ మాట నెగ్గించుకోవ‌డానికి పోటీ ప‌డ్డారు. ఎలాగోలా న‌చ్చిన వారికి టికెట్లు ఇప్పించుకున్న నేత‌లు ఇప్పుడు వారిని గెలిపించుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp