గ్రేటర్ వార్ : ఉత్తమ్ కు అగ్ని పరీక్ష

గ్రేటర్ ఎన్నికలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెద్ద అగ్ని పరీక్షగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికలో నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఆయనతో పాటు సుమారు 100 మంది వరకూ చోటామోటా నేతలు అక్కడే మకాం వేశారు. ప్రధానంగా ఉత్తమ్ ప్రచారంలో తీవ్రంగా కష్టపడ్డారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ రెండు పార్టీలూ దొందూ దొందే అని టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు వ్యక్తం చేస్తూ ప్రసంగాలు సాగించారు. ఉత్తమ్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కనీసం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు మొదలు కావడంతో ఉత్తమ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దుబ్బాక ఫలితం నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలతోనైనా తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో..
గత గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డులకు గాను కాంగ్రెస్ కు దక్కిన సీట్లు కేవలం రెండు. టీఆర్ఎస్ కు 99, మజ్లిస్ పార్టీకి 44, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్ కు ఒక రకంగా జీవన్మరణ సమస్యే. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ గత ఐదేళ్లలో రోజురోజుకూ తగ్గుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ధీటైన ప్రతిపక్ష పార్టీ గా ఉందనే విషయంలోనూ రాజకీయ విశ్లేషకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం, అసలు సిసలైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ఘంటా పథంగా చెప్పుకోవాలంటే గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్ని చోట్లా ప్రతికూల ఫలితాలే..
రాష్ట్రంలో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక దాదాపు అన్ని రకాల ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఫలితాల విషయానికొస్తే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పీసీసీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు కెప్టెన్ ఉత్తమ్ గత కొద్ది నెలల క్రితం సంసిద్ధమైనప్పటికీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడిని నియమించకపోవడంతో ఆయనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎంపీ మణీకం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలే కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి బల్దియాపై జెండా ఎగరేసేందుకు ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమీక్ష నిర్వహించి పలువురికి బాధ్యతలు అప్పగించింది. ప్రచారపర్వం కొనసాగుతూనే ఉంది. కానీ ఈ ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఎక్కడా చూసినీ టీఆర్ఎస్, బీజేపీ హడావిడే తప్పా కాంగ్రెస్ అంతలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో ఆ పార్టీ ఎన్ని స్థానాలను సాధిస్తుందో తెలియని పరిస్థితి. సాధించే సీట్లను బట్టే ఉత్తమ్ నాయకత్వ పటిమ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click Here and join us to get our latest updates through WhatsApp