బిఎండబ్ల్యూ కారులో చెత్త తరలింపు..ఎందుకో తెలుసా.. ?

By Voleti Divakar Dec. 02, 2020, 07:35 pm IST
బిఎండబ్ల్యూ కారులో చెత్త తరలింపు..ఎందుకో తెలుసా.. ?

లగ్జరీ కారు బిఎండబ్ల్యూను చూడటమే అరుదు. ఆ కారులో ప్రయాణించడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అలాంటి ఖరీదైన కారులో ఒక వ్యక్తి చెత్తను తరలించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఎందుకీ పనిచేశారో తెలుసా.! ఏడాదిన్నర క్రితం కొనుగోలు చేసిన ఆ కారు సుమారు 380 రోజుల పాటు సర్వీస్ సెంటర్లోనే ఉంది. కారుతో పాటు, సర్వీసు సెంటర్ వారి పనితీరుతో విసుగెత్తిపోయి యజమాని కారులో చెత్తను తరలించి నిరసన వ్యక్తం చేశారు. మరో 18 మంది బిఎండబ్ల్యూ కార్ల యజమానులు కూడా ఆయనతో కలిసి షోరూమ్ ఎదుట కార్లలో చెత్తను తరలించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడం విశేషం.

ఇంతకీ ఏం జరిగిందంటే...

జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త ప్రిన్స్ శ్రీవాస్తవ విలువైన బిఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసి తన తండ్రికి బహుమతిగా ఇచ్చారు. కారు కొనుగోలు చేసిన నాటి నుంచి దానిలో ఎసి, హ్యాండ్ బ్రేక్ పనిచేయలేదు. ఆఖరికి సెల్ఫ్ కూడా పనిచేయకపోవడంతో తోస్తే కానీ కారు స్టార్ట్ కాని పరిస్థితి. దీంతో శ్రీవాస్తవ దాన్ని రాంచీలోని కారు షోరూమ్ కు సంబంధించిన సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సర్వీస్ సెంటర్ వారు దాన్ని పరిశీలించి బాగు చేసినట్లు చెప్పారు.

అయినా కారు పనితీరులో మార్పులేకపోయింది. ఇలా 380రోజుల పాటు శ్రీవాత్సవ సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. పైగా రూ. 3లక్షల బిల్లు వేశారు. ఏ బాగు చేశారని ఇంత బిల్లు వేశారని నిలదీస్తే సర్వీస్ సెంటర్ నుంచి సరైన సమాధానం రాలేదు. బిఎండబ్ల్యూ కారు పనితీరు, సర్వీస్ సెంటర్ నిర్వాహకుల ప్రతిస్పందన చూసి విసుగెత్తిపోయిన ఆయన కారులో చెత్తను తరలిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బిఎండబ్ల్యూ యాజమాన్యంపై న్యాయపోరాటం కూడా చేస్తానని శ్రీవాస్తవ చెప్పారు.

రాంచీ వీధుల్లో బిఎండబ్ల్యూ కారులో చెత్తను తరలిస్తున్న దృశ్యాలను శ్రీవాస్తవ సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో దేశవ్యాప్తంగా కారు పనితీరు చర్చనీయాంశంగా మారింది. మరో 18 మంది బిఎండబ్ల్యూ యజమానులు దీనిపై స్పందిస్తూ తాము కూడా ఈ కారుతో వేగలేకపోతున్నామంటున్నారు. త్వరలో వారంతా కలిసి రాంచీలోని కారు షోరూమ్ ఎదుట కార్లలో చెత్తను తరలిస్తూ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడం విశేషం. అప్పటికైనా యాజమాన్యం దిగివస్తుందో లేదో మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp