కీలక అడుగులు వేస్తున్న గల్లా కుటుంబం, టీడీపీ శిబిరంలో కలకలం

By Raju VS Oct. 01, 2020, 05:50 pm IST
కీలక అడుగులు వేస్తున్న గల్లా కుటుంబం, టీడీపీ శిబిరంలో కలకలం

తెలుగుదేశం పార్టీకి పరిస్థితులు ఏమీ అనుకూలించడం లేదు. చంద్రబాబు తో పాటుగా ఆయన పార్టీ కూడా నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారుతోంది. ఏ రోజు ఏ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే కలవరం కనిపిస్తోంది. తాజాగా గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. ఈమేరకు చంద్రబాబుకి ఆమె లేఖ రాసి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. దాంతో టీడీపీలో కొత్త చర్చ మొదలయ్యింది.

ఇప్పటికే ఆమె కుమారుడు , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం పై పలు కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన టీడీపీ ని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు చాలాకాలంగా ఊహాగానాలున్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా ఆయన తీరు మీద పలు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో పొలిట్ బ్యూరో నుంచి గల్లా అరుణ కుమారి వైదొలగడం వెనుక ఏదో వ్యూహం ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.

గల్లా అరుణ కుమారి తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానానికి ఎదిగారు. వైఎస్సార్ హయంలో మంత్రి పదవి అనుభవించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో టీడీపీలో చేరారు. 2014లో ఆమె కుమారుడు ఎంట్రీ ఇచ్చి గుంటూరు నుంచి లోక్ సభ బరిలో దిగారు. తొలిసారి విజయం సాధించారు. పార్లమెంట్ లో మిస్టర్ పీఎం అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద ప్రచారం దక్కింది. 2019లో వరుసగా రెండో సారి గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు విజయం దక్కకపోయినా పార్లమెంట్ సీటులో గల్లా జయదేవ్ గెలుపు విశేషంగానే చెప్పాలి.

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి ఆయోమయంగా మారుతోంది. అధికారం కోల్పోవడంతో అనేకమంది దూరమవుతున్నారు. అదే సమయంలో అమరావతి అంశంలో కూడా చంద్రబాబు తో కలిసి జయదేవ్ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఇటీవల ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదు. దానికి అనేక కారణాలుండవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీతో ఆయన సాన్నిహిత్యం పెరుగుతుండడం ప్రధానాంశంగా కనిపిస్తోంది. దానికి తోడుగా ఏపీలో ఇటీవల అమర్ రాజా బ్యాటరీ కంపెనీలకు సంబంధించిన భూముల అంశంలో జగన్ దూకుడుగా వ్యవహరించారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా తాత్కాలికంగా ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుకట్టవేసినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా లేదు.

దాంతో తమ ఆర్థిక, రాజకీయ అవసరాల కోసం గల్లా కుటుంబం కీలక నిర్ణయం తీసుకునే దిశలో సాగుతున్నట్టు కనిపిస్తోంది. దాంతో వాళ్లు ఎలాంటి అడుగులు వేస్తారన్నది టీడీపీలో కంపరం పుట్టించే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు లాంటి చోట్ల టీడీపీ ఎంపీ చేజారిపోతే టీడీపీకి పెద్ద షాక్ అవుతుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులంతా పార్టీని వీడారు. ఒక్కరు మాత్రమే టీడీపీకి మిగలారు. లోక్ సభ సభ్యుల్లో కూడా కేశినేని నాని తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పక్క చూపులు చూస్తే లోక్ సభలో కూడా టీడీపీ ఒంటరిపాలయ్యే ప్రమాదం లేకపోలేదు. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసే అంశంగా అంతా భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp