కరివేపాకు బ్యాచ్ లో గద్దె !! వాడుకుని వదిలేశారని ఆవేదన!!

By Nehru.T Sep. 27, 2020, 06:25 pm IST
కరివేపాకు బ్యాచ్ లో గద్దె !! వాడుకుని వదిలేశారని ఆవేదన!!

అవసరం ఉన్నంత మేరకు వాడుకోవడం .. తరువాత విసిరేయడం... రసం ఉన్నంత వరకూ పిండుకోవడం.. చివర్లో చెత్తడబ్బాలో పడేయడం. ఇది టిడిపి అధినేతకు వెన్నతో పెట్టిన విద్య. ఈ వైఖరితో ఇప్పటికే పలువురు నాయకులు నష్టపోగా ఇప్పుడు తాజాగా ఈ బ్యాచ్ లోకి మరో సీనియర్ నాయకుడు చేరారు.

తెలుగుదేశానికి ఒకప్పుడు బాగా పట్టున్న విజయనగరం జిల్లాలో అసమ్మతి సెగలు గుప్పుమన్నాయి. గత సాధారణ ఎన్నికలు ముగిసిన నాటి నుండి పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి జ్వాలలు ప్రభుత్వ మాజీ విప్ , చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు రాజీనామా రూపంలో బయటపడ్డాయి.

గద్దె బాబూరావు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి 1994, 1999 లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి పార్టీ అధినేత ఎన్టీరామారావు కు అత్యంత సన్నిహితునిగా మెలిగారు. ఆ సన్నిహిత్యంతోనే పార్టీ విప్ గా కూడా పని చేసారు. అయితే ఆ తరువాత ఆయన పార్టీలో మనలేకపోయారు. ఇన్నాళ్లుగా పార్టీకోసం పని చేస్తున్నా తనను కనీసం గుర్తించడం లేదని ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎన్టీరామారావు కాలం నాటి సిద్ధాంతాలు, నైతిక సూత్రాలకు కాలం చెల్లిందని , ఆత్మ గౌరవం అనే మాట అక్కడ ఇప్పుడు వినబడడం లేదని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో తాను ఇంకా టిడిపిలో ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు.. భవిష్యత్ లో ఏ పార్టీలోకి వెళ్తానో తెలియదని 78 ఏళ్ల బాబూరావు వివరించారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను గత 15 ఏళ్లుగా అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నాను అన్నారు.. తనలాంటి సీనియర్లకు చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని అన్నారు.

పార్టీలో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయని , సీనియర్లకు గుర్తింపు లేదని , పొమ్మనలేక పొగపెడుతున్నారని ఆవేదన చెందారు. ఎన్టీయార్ హయాంలో రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగువెలిగి , జిల్లాలో పార్టీకి అంతా తానై వ్యవహరించారు. టీడీపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టాక ఈయన హవా కొంత తగ్గింది. 2004 తరువాత పార్టీలోకి యువతరం రావడం, అశోకగజపతి రాజు క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల గద్దె హవా తగ్గింది.

2014 , 2019 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ ఆశించినా రాలేదు. దాంతోబాటు ఆయన్ను అశోక్ గజపతి రాజు కూడా దూరం పెడుతూ వచ్చారు. పోనీ జిల్లాలో పెద్దరికం దక్కకున్నా రాష్ట్ర స్థాయిలో అయినా చంద్రబాబు దగ్గర ఏమన్నా పరపతి ఉందా అంటే అదీ లేదు. దీంతో ఆయన పార్టీని వీడక తప్పలేదు. గతంలో ఈయన రెండుసార్లు టిడిపిని వీడారు. కొంతకాలం వైసీపీలో కూడా పని చేసారు. 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ టిడిపిలో చేరారు. ఇప్పుడు మళ్లీ మూడోసారి పార్టీని వీడుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp