నాడు–నేడుతో ‘తేడా’ సుష్పష్టం

By Jaswanth.T Sep. 17, 2020, 10:40 am IST
నాడు–నేడుతో ‘తేడా’ సుష్పష్టం

రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలులో సీయం వైఎస్‌ జగన్‌కి ముందు– తరువాత అన్న బేరీజు భవిష్యత్తులో తప్పకుండా వేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, సామాజిక ఆర్ధిక భరోసా తదితర కార్యక్రమాల్లో తనదైన ముద్రను జగన్‌ వేస్తున్నారు. ఇందుకు ఎన్నివేల కోట్లు ఖర్చైనప్పటికీ వెనకడుగు వేయడం లేదు.

వ్యక్తుల జీవితాల్లో విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రాథమిక స్థాయి నుంచే అందుకు చక్కటి బాటలు పడితే భవిష్యత్తులో వారు రాణించగలుగుతారని నూటికి నూరుశాతం వైఎస్‌ జగన్‌ నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు తాను చేస్తున్న ఖర్చు భవిష్యత్‌ తరాలపై పెట్టుబడిగా ఆయన చెబుతున్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను అందించగలిగే.. భవిష్యత్తు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొగలిగే సత్తాను పొందేందుకు తగ్గ అవకాశం వ్యక్తులకు లభిస్తుంది.


ఈ నేపథ్యంలో తాను అధికారంలోకొచ్చిందే తడవుగా ప్రారంభించిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’ కార్యక్రమం ఒకటి. ఇందుకు చేసిన ఖర్చు ప్రస్తుతం ప్రతి ఒక్కరి కళ్ళకు కన్పిస్తోంది. మొదటి విడత ఈ కార్యక్రమంలో భాగంగా 15,715 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం రూ. 12వేల కోట్లు కేటాయించగా, తొలివిడతకు రూ. 3,500 కోట్లు విడుదల చేసారు. ఆయా పనులకు నిర్ణీత కాలపరిమితిని ఏర్పాటు చేసారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు, ఉపాధ్యాయులు సంయుక్తంగా ఆయా పాఠశాలలకు అవసరమైన సరంజామాను కొనుగోలు చేసి, పనులు చేయించుకునే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

పాఠశాలల్లో గుర్తించిన మౌలిక వసతులకు పెద్ద పీఠవేసే విధంగా జాయింట్‌కలెక్టర్‌ స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఆయా పనులను దగ్గరుంచి చేయిస్తున్నారు. తద్వారా తమ పిల్లలు చదువుకునే పాఠశాలను కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు చేపట్టిన పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు జరిగిన పనులను సమీక్షిస్తూ వెనువెంటనే పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారు. అక్టోబర్‌ 5న లేదా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పాఠశాలలు తెరుచుకోవచ్చునన్న ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. దీంతో అప్పటికి పూర్తిస్థాయి సదుపాయాలతో మొదటి ఫేజ్‌లో ఎంపికైన స్కూల్స్‌ సిద్ధం చేయ్యాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.ఇప్పటికే పూర్తయిన పలు పాఠశాలు కొత్తరూపును సంతరించుకుని ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. ఆకట్టుకునే రంగులు, నూతనంగా సిద్ధం చేసిన బల్లలు/డెస్కులు, స్కూలు గోడలపై ఆసక్తిగొలిపే పెయింట్‌లు, ఆవరణలో బురద లేకుండా మెరక పనులు, రన్నింగ్‌ వాటర్‌తో మరుగుదొడ్లు, త్రాగునీటి సదుపాయం, తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్‌లు, సైకిళ్ళు పెట్టుకునే స్టాండ్‌లు, ఆవరణలో పచ్చటిమొక్కలు పెంపకం తదితర ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రైవేటు/కార్పొరేట్‌ పాఠశాలలకు థీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందిస్తున్నారు. అలాగే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా ఆ లోటు కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తదితర కార్యక్రమాల ద్వారా పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారులు చదువుకు దూరం కాకుండా చర్యలు చేపట్టారు జగన్‌.

కాగా విద్యారంగంపై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. పైగా ప్రభుత్వ విద్యారంగాన్ని ఎప్పుటికప్పుడు నీరుగార్చే ప్రయత్నాలే చేసిందని ఆ రంగ నిపుణులు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 30మంది విద్యార్ధులకంటే తగ్గితే ఆయా పాఠశాలలను మెర్జ్‌చేయడం, అక్కడి నుంచి తొలగించడం చేపట్టేవారు. విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక మార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ, ఉపాధ్యాయ సంఘాలు రోడ్డెక్కి ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి జగన్‌ పాలనకు ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన తేడాలను ప్రజలు సుష్పష్టంగానే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం రికమెండేషన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న రీతిలో ఈ ఏర్పాట్లు ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp