తొలి మహిళా కార్డియాలజిస్ట్ మరణం

By Srinivas Racharla Aug. 31, 2020, 12:20 pm IST
తొలి మహిళా కార్డియాలజిస్ట్ మరణం

దేశంలో తొలి మహిళా కార్డియాలజిస్ట్‌గా గుర్తింపు పొందిన డాక్టర్ ఎస్ఐ పద్మావతి (103) మరణించారు.కరోనా వైరస్ బారిన పడిన ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.11 రోజుల క్రితం కరోనా వైరస్ సోకిన డాక్టర్ పద్మావతిని వైద్యం కోసం కుటుంబసభ్యులు నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌హెచ్ఐ) లో చేర్పించారు.అయితే ఆమె ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా సోకడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదని ఎన్‌హెచ్ఐ సీఈఓ డాక్టర్ ఓపీ యాదవ్ తెలిపారు.

పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ శ్మశాన వాటికలో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.వందేళ్లు పైబడిన వయస్సులోనూ ఆమె కరోనా కోరలలో చిక్కుకోవడానికి ముందు వరకు ఎంతో చురుకుగా,ఆరోగ్యం ఉన్నారు.గత జూన్ 11న తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపేందుకు వచ్చిన వైద్య విద్యార్థులతో కలిసి డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి కేక్ క‌ట్‌ చేసి,వేడుకలలో ఉల్లాసంగా పాల్గొన్నారు.

డాక్టర్ పద్మావతి 1950 నుంచి కార్డియాలజిస్ట్‌గా ఢిల్లీలో కొన్నివేల‌మందికి వైద్య సేవ‌లు అందిస్తూ వ‌స్తున్నారు.స్వతంత్ర భారత మొదటి ఆరోగ్యశాఖ‌ మంత్రి రాజ్‌కుమారి అమృత్ కౌర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి గురించి తెలుసుకుని, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అధ్యాప‌కురాలిగా ఆమెను నియ‌మించారు.ఇక్కడే ఉత్తర భారతదేశంలో తొలిసారిగా 1954లో కార్డియాక్ కాథెటరైజేషన్ లాబొరేటరీని ఆమె స్థాపించారు.1967లో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ డైరెక్టర్-ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పద్మావతి అక్క‌డ గుండె వ్యాధుల సంబంధిత పలు పరిశోధనలలో పాల్గొన్నారు.ఇక్కడే ఆమె కార్డియాలజీలో తొలిసారి డీఎం కోర్సు, మొదటి కొరోనరీ కేర్ యూనిట్‌తో పాటు, దేశంలో మొదటి కొరోనరీ కేర్ వ్యాన్‌ను కూడా ప్రారంభించారు.

ఆమె మాజీ ప్రధాన మంత్రులు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, లాల్ బ‌హ‌దుర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ,అట‌ల్ బీహారీ వాజ‌పేయి వంటి పలువురు ప్రముఖులకు తన కార్డియాలజీ వైద్య సేవ‌లు అందించారు. ఇర్విన్,జీ బి పంత్ హాస్పిటల్స్‌లతో కూడా అనుబంధం ఉన్న డాక్టర్ పద్మావతి 1962లో ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్,1981లో నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించారు.

తన వైద్య సేవలతో ఆమె ‘గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ’గా గుర్తింపు పొందారు. ఆమె వైద్యసేవలను గుర్తించిన కేంద్రం 1967లో పద్మ భూషణ్,1992లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp