మళ్లీ మొదలైన అంతర్జాతీయ క్రికెట్....ఇంగ్లాండ్-వెస్టిండీస్‌ల తొలి టెస్టుకు వర్షం దెబ్బ

By Srinivas Racharla Jul. 08, 2020, 09:39 pm IST
మళ్లీ మొదలైన అంతర్జాతీయ క్రికెట్....ఇంగ్లాండ్-వెస్టిండీస్‌ల తొలి టెస్టుకు వర్షం దెబ్బ

కరోనా వైరస్‌ కారణంగా గత మార్చి నుంచి నాలుగు నెలల పాటు నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ మొదలయింది.బుధవారం మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌథాంప్టన్‌ స్టేడియంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ఆరంభమయ్యింది.ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ వ్యక్తిగత కారణాలతో దూరం కాగా అతని స్థానంలో బెన్‌ స్టోక్స్‌ సారథ్యం వహిస్తున్నాడు.సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ మ్యాచ్‌కు జాసన్ హోల్డర్ నాయకత్వంలో విండీస్ బరిలోకి దిగింది. వర్షం వల్ల దాదాపు రెండు గంటలు ఆలస్యంగా మొదలైన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్‌ని ఎన్నుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌కు పరుగుల ఖాతా తెరవకుండానే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డొమినిక్‌ సిబ్లీ 4 బంతులు ఎదుర్కొని షానన్‌ గ్యాబ్రియేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 4.1 ఓవర్‌ల వద్ద ఇంగ్లాండ్‌ 3/1తో ఉండగా వర్షంతో మరోసారి ఆట నిలిచింది.కొద్దిసేపటి తర్వాత వర్షం తెరిపి నివ్వడంతో 17.4 ఓవర్ల పాటు ఆట కొనసాగింది.ఆ సమయంలో మరలా వర్షం ప్రారంభం కావడంతో టీ బ్రేక్ ఇచ్చారు.అయితే ఎంతసేపటికీ వర్షం ఆగకపోవడంతో తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు.ఇక పదేపదే వర్షం అవాంతరం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆతిథ్య ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఆట నిలిచిపోయే సమయానికి జో డెన్లీ 14 పరుగులు,రోరీ బర్న్స్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు "బ్లాక్‌ లైవ్స్‌" ఉద్యమానికి సంఘీభావంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఒక మోకాలిపై కూర్చొని పిడికిలి పైకెత్తి జాతి వివక్షపై తమ నిరసనను వ్యక్తం చేశారు.అలాగే ఐసీసీ అనుమతి పొందిన ఆటగాళ్లందరూ 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' లోగోతో మైదానంలోకి అడుగు పెట్టారు..

తొలిసారి ఖాళీ మైదానాలలో....

ఇక వాస్తవానికి ఇంగ్లీష్ క్రికెట్ అభిమానులలో యాషెస్ సిరీస్ కున్నంత క్రేజ్ ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు.కానీ కరోనా వ్యాప్తితో వచ్చిన నాలుగు నెలల విరామం తర్వాత జరగడంతో పాటు సరికొత్త నియమాలతో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరిని ఈ టెస్ట్ మ్యాచ్ అమితంగా ఆకర్షిస్తుంది.

ఆటగాళ్ల రక్షణకు పెద్దపీట వేసిన ఇంగ్లండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్‌ (బయోబబుల్ సృష్టించి) వాతావరణంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ మైదానాలలో ఈసీబీ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది.143 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఈ టెస్ట్ సిరీస్ కోసం సుమారు నెల రోజుల ముందు నుంచే ఇరు జట్ల ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన తర్వాతనే తొలి టెస్టుకు జట్లను ఎంపిక చేసారు.

కొత్తగా కొంగొత్తగా:

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఐసీసీ క్రికెట్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వీటిలో ముఖ్యంగా బంతిపై ఉమ్మి రుద్దడాన్ని నిషేధించింది.ఒకవేళ పొరపాటుగా క్రికెటర్ ఉమ్మి రుద్దితే తొలిసారి అంపైర్లు హెచ్చరిస్తారు. రెండుకన్నా ఎక్కువసార్లు అదే పని చేస్తే జరిమానాగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు.
సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్,లంచ్ బ్రేక్, టీ బ్రేక్ ఉంటాయి. కానీ కరోనా కారణంగా ఇప్పటి నుంచి కొత్తగా శానిటేషన్‌‌ బ్రేక్‌లు కూడా ఇవ్వనున్నారు. అంటే మ్యాచ్‌ మధ్యలో క్రికెటర్లంతా హ్యాండ్‌ శానిటైజర్లు రుద్దుకోవాలి. అలాగే ఆటగాళ్లు ఉపయోగించే వస్తువులను కూడా క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేస్తారు.ఇక రిజర్వు ఆటగాళ్లే బాల్ ‌బాయ్స్‌గా ఉండగా,స్థానికులే అంపైర్లుగా వ్యవహరిస్తారు.క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేసే కెమెరా మెన్స్ తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp