తొలి కార్పొరేటర్ అక్కడ నుంచే.. !

By Rishi K Dec. 04, 2020, 08:00 am IST
తొలి కార్పొరేటర్ అక్కడ నుంచే.. !

రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య బాహాబాహీగా జరిగిన ఎన్నికల ప్రచారంలో అంతిమ విజయం ఎవరిదని రాజకీయ విశ్లేషకులు కండ్లల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు. అటు పాతబస్తీలో ఎంఐఎం తన ప్రాభావాన్ని నిలబెట్టుకుంటుందా.. లేక బీజేపీ ప్రచారంతో దెబ్బ పడిందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వరద సాయం వంటి కార్యక్రమాలు, హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారా.. లేక బల్దియా రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారా నేడు తేలిపోనుంది. జీహెచ్ఎంసీలో 149 డివిజన్లకు సంబంధించి 46.55 శాతం ఓటింగ్ నమోదయినట్టు అధికారులు ప్రకటించారు. టెక్నికల్ సమస్యల కారణంగా నిలిచిన ఓల్డ్ మలక్ పేట డివిజన్ ఎన్నికలు కూడా గురువారం ప్రశాంతంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకూ 38.46 శాతం ఓట్లు పోలయినట్టు తెలుస్తోంది. గ్రేటర‌లోని 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు

30 సర్కిళ్లకు ఒక్కో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 31 కౌంటింగ్ పరిశీలకులతో కలిపి 8,152 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వీరికి ఉదయం టిఫిన్ , భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీలో 149 డివిజన్లలో 46.55 శాతం ఓటింగ్ నమోదయింది. 74,67,256 ఓట్లు ఉండగా 34 ,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కో డివిజన్‌కు సంబంధించిన హాల్‌లో 14 టేబుళ్లు ఉంటాయి. టేబుల్‌కు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక్కో రౌండ్‌లో టేబుల్‌కు వెయ్యి చొప్పున 14 వేల ఓట్లను లెక్కిస్తారు. చాలా డివిజన్లలో 20-50 వేల మధ్యనే ఓట్లు నమోదు కావడంతో రెండు, మూడు రౌండ్లతోనే తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుండగా.. అతి తక్కువ ఓట్లు పోలయిన డివిజన్‌ నుంచి మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. 150 డివిజన్లలో ఈ ఎన్నికల్లో మొట్టమొదటి కార్పొరేటర్ మెహదీ పట్నం నుంచి రానున్నారు. ఈ డివిజన్‌లో 34,341 మంది ఓటర్లు ఉండగా.. 11,818 మంది తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఈ డివిజన్ ఓటింగ్ శాతం 32.66 కాగా.. అతి తక్కువ ఓట్ల సంఖ్య మాత్రం ఇక్కడ నుంచే ఉంది. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లను లెక్కించేందుకు అవకాశం ఉండగా.. ఈ స్థానంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు ఫస్ట్ రౌండ్‌లో 12 టేబుళ్లు సరిపోతాయి. ఇంకో రెండు టేబుల్స్ ఖాళీగా ఉండగానే.. జీహెచ్ఎంసీ మొదటి కార్పొరేటర్ ఎవరనేది స్పష్టంగా తేలిపోనుంది. ఈ డివిజన్ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి సంతోష్ కుమార్ , బీజేపీ నుంచి డి. గోపికృష్ణ, కాంగ్రెస్ నుంచి ఉమా మహేష్ బరిలో ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp