ఏపీలో తొలి కరోనా మరణం.. విజయవాడ లో ఆలస్యంగా వెలుగులోకి..

By iDream Post Apr. 03, 2020, 03:37 pm IST
ఏపీలో తొలి కరోనా మరణం.. విజయవాడ లో ఆలస్యంగా వెలుగులోకి..

కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తొలి మరణం సంభవించింది. విజయవాడలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ మృతి చెందారు. ఢిల్లీలో నిజాముద్దీన్‌ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి ఈ నెల 17న విజయవాడకు తిరిగొచ్చారు. సదరు వ్యక్తి నుంచి ఆయన తండ్రికి (55) కరోనా సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి 30న కరోనా లక్షణాలతో ఆయన విజయవాడ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. పరీక్షలు నిర్వహించిన గంటలోపే మరణించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతి చెందిన వ్యక్తికి షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉండటంతో ఇది కరోనా మరణంగా గుర్తించేందుకు జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారులోని కుమ్మరిపాలెంలో వీరితో కాంటాక్ట్‌లో ఉన్న 29 మందిని గుర్తించి వారందరినీ అధికారులు క్వారంటైన్‌కు పంపారు.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు, మూడు రోజులుగా పదుల సంఖ్యలో కేసులు పెరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి పాజిటివ్ కేసులు 161కు చేరాయి. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థలనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 161 పాజిటివ్ కేసులుంటే.. ఢిల్లీతో లింకులు ఉన్నా కేసులు 140 ఉన్నాయి.

ఏపీ నుంచి తబ్లీగ్ జమాతేకు వెళ్లిన మొత్తం 1,085మంది కాగా.. 881మందికి పరీక్షలు పూర్తి చేశారు.. వీరిలో 108మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జమాతేకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు 613 మందికి పరీక్షలు చేస్తే.. 32 మందికి కరోనా పాజిటివ్ తేలింది. అంటే మొత్తం 140మందికి ఢిల్లీతో లింక్‌లు ఉన్నాయి. ఈ వైరస్ ఎంత మందికి సోకి ఉంటుందనే ఆందోళన అధికారుల్లో నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp