ప్ర‌త్య‌క్ష మేయ‌ర్ కు అదే.. తొలి, చివ‌రి ఎన్నిక‌..!

By Kalyan.S Nov. 25, 2020, 10:00 pm IST
ప్ర‌త్య‌క్ష మేయ‌ర్ కు అదే.. తొలి, చివ‌రి ఎన్నిక‌..!

ప్ర‌స్తుతం జీహెచ్ఎంసీ మేయ‌ర్ పీఠం కోసం పార్టీల‌న్నీ క‌త్తులు దూసుకుంటున్నాయి. మేయ‌ర్ ప‌ద‌వి మాదంటే మాదే.. అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఆ ల‌క్ష్యంతోనే ప్ర‌చారంలో తీవ్రంగా పోరాడుతున్నాయి. 150 వార్డులు గ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో అధికారం చేజిక్కుంచుకుంటే దాదాపు తెలంగాణ మొత్తంమ్మీద ప‌ట్టు సాధించిన‌ట్లేన‌ని రాజ‌కీయ పార్టీల‌న్నీ భావిస్తాయి. అందుకు కార‌ణం గ్రేట‌ర్ కేంద్రంగానే రాష్ట్ర రాజ‌కీయాలు తిరుగుతుండ‌డం. అందుకే కీల‌క‌మైన జీహెచ్ఎంసీ మేయ‌ర్ పీఠంపై పార్టీల‌న్నీ గురి పెడుతున్నాయి.

ప‌రోక్షం - ప్ర‌త్య‌క్షం - ప‌రోక్షం

ప్ర‌స్తుతం మేయ‌ర్ ను ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో ఎన్నుకుంటున్నారు. ఏ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుస్తుందో.. ఆ పార్టీకి చెందిన కార్పొరేట‌ర్ ను మేయ‌ర్ గా ఎంపిక చేస్తున్నారు. ఆ కార్పొరేట‌ర్ ఎవ‌ర‌నేది పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యిస్తుంది. కానీ 2002లో మేయ‌ర్ ను ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో ఎన్నుకున్నారు. నాడు 100 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. టీఆర్‌ఎస్‌ తరఫున నాయిని నర్సింహారెడ్డి మేయర్ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నారు. మరో 50 డివిజన్ల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి టి.పద్మారావు (ప్రస్తుతం మంత్రి) తప్ప మిగిలిన వారంతా ఓడిపోయారు. అప్ప‌ట్లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఉన్న తీగ‌ల కృష్ణారెడ్డి మేయ‌ర్ ప‌ద‌వికి ప్ర‌త‌క్ష్య ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌య్యారు. న‌వంబ‌ర్ 2, 2002లో పాల‌క‌వ‌ర్గం ఏర్పాట‌యింది. ఫిబ్ర‌వ‌రి 27, 2007 వ‌ర‌కూ ఆ పాల‌క‌మండ‌లి కొన‌సాగింది. 2002 కు ముందు కూడా మేయ‌ర్ ఎన్నిక ప‌రోక్ష ప‌ద్ధ‌తిలోనే ఉండేది. 2002 త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల‌లోనూ అంతే. ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో జ‌రిగిన మేయ‌ర్ ఎన్నిక తొలిసారి, చివ‌రి సారి కూడా 2002లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తిప‌క్షాల స‌వాళ్లు..!

మేయ‌ర్ ఎన్నిక‌ను ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించాల‌న్న వాద‌న ఇప్పుడు కూడా మొద‌లైంది. అడ‌పాద‌డ‌పా ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌భ‌లు, ప్ర‌సంగాల‌లో ఈ ప్ర‌స్తావ‌న తెస్తున్నారు. ఎంసీహెచ్‌గా ఉన్న కార్పొరేషన్‌లో దశాబ్దాల పాటు, మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరిగాయి. కానీ చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలే జ‌రిగాయి. నేరుగా ఎన్నికయిన మేయర్ రికార్డు ఇప్పటికీ తీగ‌ల కృష్ణారెడ్డి పేరుతోనే ఉంది. ఆయ‌న ప్ర‌స్తుతం టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో టీఆర్‌ఎస్‌కు అనేక కోణాల్లో బలం- సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒక‌వేళ ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌కు వెళ్లినా టీఆర్ఎస్ కే క‌లిసొచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌క్ష ప‌ద్ధ‌తిలో ఎన్నిక నిర్వ‌హ‌ణ‌కు టీఆర్ఎస్ భ‌య‌ప‌డుతోందంటూ ప్ర‌తిప‌క్షాలు దాన్నొక ప్ర‌చార ఆయుధంగా మ‌లుచుకున్నారు. టీఆర్ఎస్ ఈ విష‌యాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp