తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు - ఐదుగురు దుర్మరణం

By Kiran.G Oct. 23, 2020, 05:47 pm IST
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు - ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. బాణసంచా తయారుచేసే కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే విరుదునగర్‌ జిల్లా సరిహద్దుల్లోని మురుగనేరి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన సంభవించింది. రాజ్యలక్ష్మి బాణసంచా కర్మాగారంలో దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో కర్మాగార యజమాని దాదాపు 50 మంది కార్మికులతో బాణసంచా తయారీ చేయిస్తున్నాడు. కాగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరారీలో ఉన్న రాజ్యలక్ష్మి బాణసంచా కర్మాగారం యజమాని షణ్ముగనాథన్ పై కేసు నమోదు చేసి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. కాగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విరుదునగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp