సీఎం పీఠంపై తండ్రులు.. తనయులు

By Siva Racharla Jul. 28, 2021, 02:30 pm IST
సీఎం పీఠంపై తండ్రులు.. తనయులు

వారసత్వ రాజకీయాలు అనివార్యం. ఒక నాడు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాన్ని విమర్శించిన పార్టీలన్నీ తమ పార్టీ నేతల వారసులను ప్రోత్సహించినవే.వారసుల్లో కొందరు ముఖ్యమంత్రులు అయితే మరి కొందరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా,ఎంపీలుగా ఎదిగారు.

నవీన్ పట్నాయక్ ,జగన్ మోహన్ రెడ్డిలా సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోరాడి గెలిచిన వారు కూడా ఉన్నారు . తండ్రి పెట్టిన పార్టీ తరుపునే ముఖ్యమంత్రులైన ఫారూఖ్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా, హేమంత్ సొరేన్, మెహబూబా ముఫ్తి,స్టాలిన్,కుమారస్వామి లాంటి వారసులు ఉన్నారు.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు చేపట్టనున్నారు. రాజీనామా చేసిన సీఎం యడ్యూరప్ప స్థానంలో శాసన సభాపక్ష నేతగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజ్ బొమ్మైని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. బసవరాజ్ తండ్రి ఎస్సార్ బొమ్మై కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేయడం విశేషం.
కర్ణాటకలో తండ్రీకొడుకులు ముఖ్యమంత్రులు కావడం ఇది రెండోసారి. గతంలో దేవెగౌడ అతని కొడుకు కుమార స్వామి సీఎంలుగా పని చేశారు.


ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో తండ్రీకొడుకులు, తండ్రీకూతుళ్ళు ముఖ్యమంత్రులైన సందర్భాలు ఉన్నాయి. కాశ్మీర్లో తాత, తండ్రి, మనవడు కూడా ముఖ్యమంత్రులు కావడం మరీ విశేషం. అదే కాశ్మీర్ లో తండ్రీకూతుళ్ళు సీఎంలు కావడానికి వేదిక అయ్యింది. ఇలా తండ్రుల తర్వాత సీఎంలు అయిన వారిలో కొందరు వారసత్వంగా.. కొందరు పదవుల్లో రాణించడం ద్వారా..ఇంకొందరు పోరాటాలతో ఆ పదవులు అలంకరించారు.

Also Read:క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి : నాడు తండ్రికి, నేడు కొడుకుకు తేడా ఇదే!

దేశంలోని అటువంటి సందర్భాలు పరిశీలిస్తే..
కర్ణాటకకు చెందిన జనతాదళ్ నేత ఎస్.ఆర్.బొమ్మై 1988 నుంచి 1989 వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన తనయుడు, ప్రస్తుత రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై రాజకీయ జీవితం కూడా జనతాదళ్ నుంచే మొదలైంది. 2008లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన బసవరాజ్ తండ్రి కూర్చున్న సీఎం పీఠాన్ని అందుకున్న ఘనత సాధించారు.

ఇదే కర్ణాటకలో హెచ్.డి.దేవెగౌడ జనతా దళ్ (ఎస్) తరఫున 1994-1996 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన వారసుడు కుమారస్వామి 2018 నుంచి 2019 వరకు 14 నెలలు సీఎంగా చేశారు. అయితే బీజేపీ రాజకీయాల కారణంగా ఆయన ప్రభుత్వం రద్దయ్యింది.

తండ్రి ఒక రాష్ట్రానికి.. తనయుడు మరో రాష్ట్రానికి సీఎంలుగా చేసిన సందర్భం కూడా ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నేత హెచ్.ఎన్. బహుగుణ 1973-1975 మధ్య ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నారు. కాగా ఆయన తనయుడు విజయ్ బహుగుణ 2012-2014 మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ను విడదీసి కొత్త రాష్ట్రం చేయడంతో ఈ పరిణామం సంభవించింది. తండ్రి కాంగ్రెసుకు.. తనయుడు బీజేపీకి ప్రాతినిధ్యం వహించడం మరో విశేషం.

Also Read:ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరుతారా?

ఒడిశా రాష్ట్రంలో ప్రముఖ నేత బిజూపట్నాయక్ రెండుసార్లు రెండు పార్టీల తరఫున సీఎం అయ్యారు. 1961-63 మధ్య కాంగ్రెస్ తరఫున.. ఆ తర్వాత జనతాదళ్ లో చేరి 1990 నుంచి 1995 వరకు సీఎంగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు నవీన్ పట్నాయక్ 1997లో బిజూ జనతాదళ్(బీజేడీ) ఏర్పాటు చేశారు. ఆ పార్టీ 2000 ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో సీఎం పదవి చేపట్టిన నవీన్ వారసుల విజయాలు సాధిస్తూ.. ఇప్పటికీ కొనసాగుతున్నారు. అతి సుదీర్ఘకాలం సిఎంలుగా ఉన్న పవన్ చామ్లింగ్ , జ్యోతిబసుల తరవాత మూడో నేతగా ఉన్నారు.మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఎస్బీ చవాన్ 1975-77, 1986-88 సంవత్సరాల్లో రెండుసార్లు సీఎం అయ్యారు. ఆయన తనయుడు అశోక చవాన్ అదే కాంగ్రెస్ తరఫున 2008 నుంచి 2010 వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.

జమ్మూకాశ్మీర్ లో మూడు తరాలవారు, తండ్రీకూతుళ్లు కూడా సీఎం పదవులు అధిష్టించారు. రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించిన నేషనల్ కాన్ఫెరెన్సు కు చెందిన షేక్ అబ్దుల్లా 1975 నుంచి 1982 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. అనంతరం ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా 1982-84, 1986-90, 1996-2002 మధ్య మూడు పర్యాయాలు సీఎంగా చేశారు. ఆ తర్వాత ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా వంతు వచ్చింది. ఆయన 2009 జనవరి ఐదు నుంచి 2015 జనవరి ఎనిమిది వరకు సీఎంగా ఉన్నారు.

Also Read:కిషన్ రెడ్డి కి పెరుగుతున్న ప్రాధాన్యత

కాశ్మీర్ కే చెందిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షుడు ముఫ్టీ మహమ్మద్ సయీద్ 2002-05, 2015-16 మధ్య సీఎంగా చేశారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన కూతురు మెహబూబ్ ముఫ్తి 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు.

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నేత సీ.ఎం.దొర్జి ఖండూ 2007 నుంచి 2011 మధ్య రెండుసార్లు సీఎంగా చేశారు. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో తనయుడు పెమా ఖండూ 2011లో ఎమ్మెల్యే అయ్యారు. 2016లో సీఎం అయినా ఆయన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ స్థాపించి.. కొద్దికాలానికే దాన్ని బీజేపీలో విలీనం చేశారు.
మేఘాలయాలో పిఏ సంగ్మా 1988 నుంచి 1990 మధ్య కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయన కొడుకు కర్నాడ్ సంగ్మా యన్ పిపి తరుపున ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తనయుడు జగన్మోహన రెడ్డి కాంగ్రెసుతో విభేదించి వైఎస్సార్సీపీ ఏర్పాటు చేశారు. 2019లో భారీ విజయంతో సీఎం అయ్యారు.

జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జెఎంఎం అధినేత శిబూ సొరేన్ 2005లో కేవలం పది రోజులు, 2008-10 మధ్య కూడా సీఎంగా చేశారు. తర్వాత ఆయన తనయుడు హేమంత్ సొరేన్ 2013-14 సంవత్సరాల్లో ఒకసారి, తిరిగి 2019 డిసెంబర్లో రెండోసారి సీఎంగా ఎన్నికై ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ఉత్తరప్రదేశ్లో జనతాదళ్ తరఫున 1989లో సీఎం అయిన ములాయం సింగ్ యాదవ్ రెండేళ్లు కొనసాగారు. సమాజ్ వాది పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత1993-95, 2003-07 మధ్య మళ్లీ సీఎం అయ్యారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన అఖిలేష్ యాదవ్ 2012 నుంచి 2017 వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

హర్యానాలో మాజీ ఉపప్రధాని దేవిలాల్ తొలుత జనతా పార్టీ తరఫున 1977-79 వరకు, ఐఎంఎల్డీ నుంచి 1987 నుంచి 89 వరకు సీఎంగా చేశారు. తర్వాత ఆయన వారసుడు ఓం ప్రకాష్ చౌతాలా 1990 నుంచి 2005 మధ్య పలు దఫాలు సీఎం పీఠం అధిష్టించారు.

Also Read:బిజెపికి మమతా పెగసిస్ కమీషన్ సెగ.

కేంద్రపాలిత రాష్ట్రం పాండిచ్చేరి 1962లో భారత దేశములో విలీనం అయిన తరువాత Edouard Goubert ను మొదటి ముఖ్యమంత్రి,1963లో నామినేట్ చేశారు.

1964లో జరిగిన ఎన్నికల్లో జరిగిన తోలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి వెంకటసుబ్బ రెడ్డియార్ ముఖ్యమంత్రి అయ్యారు . వెంకట సుబ్బా రెడ్డియార్ 1964-1967 మరియు 1968లో మార్చ్ నుంచి సెప్టెంబర్ మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు.వెంకట సుబ్బారెడ్డియార్ కొడుకు వైద్యలింగం 1991 నుంచి 1996 మధ్య ఒకసారి,2008 నుంచి 2011 మధ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైద్యలింగం 2019లో కాంగ్రెస్ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యారు.

తమిళనాడులో డీఎంకే వ్యవస్థాపకుడు దివంగత కరుణానిధి 1969 నుంచి 2011 మధ్య ఐదు పర్యాయాల్లో 20 ఏళ్లు సీఎం పదవిలో ఉన్నారు. ఆయన తదనంతరం పార్టీ అధ్యక్షుడైన స్టాలిన్ ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మే ఏడో తేదీన సీఎం పదవి చేపట్టారు.

వీరే కాకూండా ఉప ముఖ్యమంత్రులైన సుఖ బీర్ సింగ్ బాదల్,తేజస్వి యాదవ్ లు ఉన్నారు.తండ్రి క్యాబినేట్ లో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్,లోకేష్ లాంటి వారసులు ఉన్నారు.

ఇంకా కేంద్రమంత్రులుగా ,రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన,చేస్తున్న వారసుల సంఖ్యా చాలా ఎక్కువ. మోడీ క్యాబినెట్ లోనే ఏడెనిమిది మంది నాయకుల వారసులు మంత్రులుగా ఉన్నారు.

వారసత్వ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన తండ్రి కూతుళ్లు ముఫ్తి మొహమ్మద్, మెహబూబా ముఫ్తి తో పాటు .దయానంద బందోడ్కర్శ,శశికళ కకోద్కర్ ఉన్నారు.

పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా,డయ్యు మరియు డామన్ 1961లో భారతదేశంలో విలీనమయిన తరువాత మూడుప్రాంతాలకు కలిపి మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నేత దయానంద బందోడ్కర్ 1963లో తోలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 1963-1966 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు .

1967,1972 ఎన్నికల్లో వరుసగా మహారాష్ట్ర గోమంతక్ పార్టీ గెలిచి దయానంద బందోడ్కర్ ముఖ్యమంత్రి అయ్యారు. 1973లో దయానంద బందోడ్కర్ మరణించటంతో ఆయన కుమార్తె శశికళ కకోద్కర్ ముఖ్యమంత్రి అయ్యారు.శశికళ కకోద్కర్ నాయకత్వంలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ 1977 ఎన్నికల్లో మరోసారి గెలిచి శశికళ కకోద్కర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి 1979 వరకు ఆ పదవిలో కొనసాగారు.

మామాఅల్లుళ్ళు మాత్రం అందరికి తెలిసిన ఎన్టీఆర్ చంద్రబాబు కాగా కాశ్మీర్ ముఖ్యమంత్రులుగా మామ షేక్ అబ్దుల్లా,ఆయన అల్లుడు గులాం మొహ్మద్ షా ..షేక్ అబ్దుల్లా,ఆయన కొడుకు ఫారూఖ్ అబ్దుల్లా,మనవడు ఒమర్ అబ్దుల్లా,అల్లుడు గులాం మొహమ్మద్ షా అంటే ఒకే కుటుంబం నుంచి నలుగురు ముఖ్యమంత్రులైన చరిత్ర అబ్దుల్లా కుటుంబానిది.

భవిషత్తులో వారసత్వ ముఖ్యమంత్రుల సంఖ్య పెరుగుతుంది.. భవిషత్తులో ఈ సబ్జెక్టు చర్చనీయాంశం కూడా కాకపోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp