మెట్టు దిగిన కేంద్రం

రెండేళ్ల పాటు వ్యవసాయ చట్టాల అమలుకు బ్రేక్ !
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఒక మెట్టు దిగింది. వ్యవసాయ చట్టాల అమలును రెండు సంవత్సరాల పాటు నిలిపివేస్తామని, అప్పటి వరకు రైతులు ఆందోళన విరమించాలని కోరింది. బుధవారం రైతు సంఘాలతో జరిగిన 10వ విడత చర్చల్లో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి పాల్గొన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కారణంగా మంగళవారం జరగాల్సిన 10వ విడత చర్చలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రేపు రైతు సంఘాలతో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రైతు సంఘాలతో చర్చించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాల సవరణకు సిద్ధమే అని, అవసరమైతే రెండేళ్ల పాటు చట్టాల అమలును నిలిపివేస్తామని రైతు సంఘాలకు తెలియజేసింది.
రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్రం మీద చెప్పుకోదగ్గ ఒత్తిడి తీసుకురాగలిగారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రభుత్వ తీరుకు నిరసనగా ట్రాక్టర్ మార్చ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మెట్టుదిగిన కేంద్రం కొంతకాలం చట్టాల అమలును నిలిపివేసేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో చట్టాలను రద్దు చేయడం మాత్రం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అవసరమైతే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని సూచించింది.
గణతంత్ర దినోత్సవాల గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తవహించవలసిన బాధ్యత రైతు సంఘాలపై ఉందని చర్చలకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విషయంలో పునః పరిశీలించాలని రైతు సంఘాలను కోరారు. ట్రాక్టర్ ర్యాలీని ఆపాలంటూ సుప్రీం కోర్టుకు కేంద్రం చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నిరసనలకు అనుమతులివ్వడమనేది శాంతిభద్రతలకు సంబంధించిన విషయమని, అది పోలీసుల పని తప్ప కోర్టుల పనికాదని తెలిపింది.
బుధవారం నాటి చర్చల్లో రైతు సంఘాలు జాతీయ దర్యాప్తు సంస్థ తమకు నోటీసులు జారీ చేయడాన్ని ప్రస్తావించారు. ఎన్ఐఏ రైతు నేతలను వేధిస్తోందని ఆరోపించారు. కాగా... ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. మరోవైపు కేంద్రం ప్రతిపాదించిన ఆందోళనల విరమణకు రైతు సంఘాలు ససేమిరా అన్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయానికి తాము అంగీకరించబోమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి.
కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ సిఫారసులను అమలు చేస్తామని ప్రభుత్వం రైతు సంఘాలకు తెలియజేసింది. కాగా.. ఈ విషయంలో రైతు సంఘాలు రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. 22వ తేదీ కేంద్రం రైతు సంఘాలతో 11వ విడత చర్చలు జరుపనుంది.


Click Here and join us to get our latest updates through WhatsApp