అర‌టి రైతు కన్నీళ్లు

By G.R Maharshi Apr. 05, 2020, 09:01 pm IST
అర‌టి రైతు కన్నీళ్లు

అర‌టి అంటే మ‌న‌కు శుభ‌సూచ‌కం. అర‌టి ఆకులో భోం చేస్తాం. అర‌టి గెల‌ల్ని శుభ‌కార్యాల‌కి వాడుతాం. అర‌టి పండ్ల‌ని తాంబూలంలో ఇస్తాం. ఇన్ని ర‌కాలుగా శుభాలు ప‌లికే అర‌టి , రైతుకి మాత్రం క‌ష్టం మిగిలిస్తోంది.

క‌డ‌ప జిల్లా లింగాల మండ‌లంలో ఒక రైతు ఆరు ఎక‌రాల అర‌టి వేశాడు. ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి. ఆయ‌న ఇంట్లో కంటే తోట‌లోనే ఎక్కువ ఉండేవాడు. తెల్లారి ఇంత తినేసి తోట‌కెళితే మ‌ళ్లీ వ‌చ్చేది రాత్రికే. పిల‌క‌లు గెల‌లుగా మారిన‌ప్పుడు ఆయ‌న క‌ల‌లు క‌న్నాడు. క‌నీసం 20 ల‌క్ష‌లు చేతికొస్తుంది. 10 ల‌క్ష‌లు అప్పులు పోయినా మిగిలిన డ‌బ్బుల‌తో పెద్ద కూతురి పెళ్లి చేయాల‌నుకున్నాడు. పంట చేతికొచ్చింది. ప్ర‌పంచ‌మే మారిపోయింది. భ‌యం త‌ప్ప శుభం లేదు. అర‌టి గెల‌లు ఉరి కొయ్య‌ల‌కు వేలాడుతున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. అంతా పోయి అప్పులే క‌నిపిస్తున్నాయి. దిగులు ప‌డ్డాడు.

కొన్ని నెల‌ల్లో పెళ్లి పీట‌ల మీద కూర్చోవాల్సిన కూతురు , ఇప్పుడు తండ్రికి కాప‌లా కాస్తోంది. తోట‌కి వెళుతున్న తండ్రిని సంతోషంగా సాగ‌నంపే కూతురు, తండ్రిని తోట వైపే వెళ్ల‌కుండా చేస్తోంది. తండ్రి ద‌క్క‌డ‌ని భ‌యం. తోట‌లో పురుగుల మందు తాగేస్తాడ‌నే భ‌యం.

పంట పోతే వ‌స్తుంది. ప్రాణం పోతే వ‌స్తుందా? కానీ పంటే ప్రాణంగా బ‌తికిన రైతు ప‌రిస్థితి ఏంటి? తోట‌లో రాలుతున్న‌ది కాయ‌లా? క‌న్నీళ్లా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp