రాజధాని చుట్టూ అనుమానాలు... భయం, ఆందోళన

By Sridhar Reddy Challa Dec. 19, 2019, 12:56 pm IST
రాజధాని చుట్టూ అనుమానాలు...  భయం, ఆందోళన

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనని నిరసిస్తూ ఈ రోజు రాజధానిలో 29 గ్రామాల ప్రజలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి. పోలీసులు అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈరోజు ఉదయం నుండే ఈ 29 గ్రామాల ప్రజలు స్వచ్చందంగా బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంత రైతులు రాజధానిని ఇక్కడినుండి తరలించే యోచనని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయం, అసెంబ్లీ లతో పాటు హైకోర్టు కూడా ఇక్కడే వుండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులు వాదన ఏంటంటే, గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ సంస్థ ని ఏర్పాటు చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములని అభివృద్ధి చేసి అనంతరం ఆ అభివృద్ధి చేసిన భూమిలో రైతుల వాటా కింద కొంత వాణిజ్య స్థలాన్ని, నివాస స్థలాలని ఇస్తామని చెప్పి, 29 గ్రామాల నుండి రైతులనుండి భూములు సమీకరించిందని, ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారం కింద ప్రభుత్వం మెట్ట ప్రాంతంలో ఎకరం భూమికి 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, అదే జరీబు భూమి ఐతే ఎకరం భూమికి 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలానికి సంబంధించిన పట్టాలు కేటాయించింది.

అయితే ఇంతలో ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వం రావడంతో పలువురు మంత్రులు రాజధానిపై మీడియాలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుండడంతో, ఆ 29 గ్రామాల రైతులలో ఆందోళన మొదలైంది. దీనికి తగ్గట్టే కొందరు మంత్రులు వ్యవహరించడం, రాజధాని ఇక్కడే కొనసాగుతుందా లేదా అనుమానాలతో మీడియాలో రాజధాని అంశం పై నిత్యం అనేక చర్చలు ఊహాగానాలు జరుగుతున్న తరుణంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని పై ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా తమ విధానం ఇదేనంటూ స్పష్టమైన ప్రకటన చేయనప్పటికి, గత ప్రభుత్వ హాయంలో జరిగిన పనులని పునఃసమీక్షించే క్రమంలో అమరావతి మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి. నాగేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూఅసెంబ్లీలో చేసిన కీలక ప్రకటన తో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఆ ప్రకటనతో ఇప్పటికే తీవ్ర అభద్రతా భావంతో ఉన్న రాజధాని ప్రాంత రైతులు రాజధాని హైకోర్టు తరలింపు యోచన ఏమైనా ఉంటే దానిని ఈ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఒకవేళ రాజధాని భూముల్లో ఏమైనా అక్రమాలు జరిగితే సదరు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం 3 పంటలు పండే తమ పంట భూములను తమ దగ్గరినుండి స్వాధీనం చేసుకొని వాటిని ఖాళీగా ఉంచడంతో అవి వ్యవసాయ యోగ్యంగా లేవని , ఆ భూములకు కౌలు కింద ఇస్తున్న పరిహారం చాలడం లేదని, ఆ భూములు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోతే ఆ తర్వాత వాణిజ్య స్థలాలు నివాస స్థలాలు తమకిచ్చినా ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనుక రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడనుండి తరలించకూడదని, ఈ అంశంపై ఇప్పటికైనా ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp