లాటరీలో ఓడిన కుటంబం

By Kiran.G Dec. 13, 2019, 01:27 pm IST
లాటరీలో ఓడిన కుటంబం

ఆశ ఉండటంలో తప్పు లేదు. కానీ దురాశ ఉండటం మాత్రం ఖచ్చితంగా తప్పే. క(ఇ)ష్టపడి సంపాదించడంలో తప్పు లేదు కానీ ఆయాచితంగా ఏ పనీ చేయకుండా సంపాదించాలి అనుకోవడం మాత్రం తప్పే.. ఆన్లైన్ బెట్టింగులు, లాటరీ టికెట్ల కొనుగోళ్లు మనుషుల అవసరాలను కష్టాలను తీరుస్తాయా..? కొన్ని వేలమంది డబ్బును లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా కలెక్ట్ చేసి ఒకడికి మాత్రమే ఆ సొమ్ము ఇవ్వడమే లాటరీ టికెట్లు విక్రయించే సంస్థల అసలు లక్ష్యం.. ఒకవేళ మనం ఆన్లైన్ బెట్టింగుల్లో గెలిచినా, లాటరీ టికెట్లను కొనడం ద్వారా బహుమతిని పొందినా ఆ డబ్బును దక్కించుకుంటున్నాం అంటే ఇంకొకడు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచుకుంటున్నట్లే లెక్క.. కానీ కేవలం సంపాదన మొత్తాన్ని లాటరీ టికెట్ల కొనుగోలుకే ఖర్చు చేసి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటే మాత్రం జీవితంపై ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే ఎందరో బెట్టింగులు లాటరీ టికెట్ల మోజులో తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు. ఇప్పుడు అలా లాటరీ టికెట్లు కొనుగోలు చేసి పూర్తిగా ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆర్ధిక సమస్యలను ఎదుర్కోలేక తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

తమిళనాడులో విల్లుపురం జిల్లా సిత్దేరికరై గ్రామానికి చెందిన అరుణ్ తన భార్యతో కలిసి తనకున్న ముగ్గురు పిల్లలకు విషమిచ్చి దాన్ని సెల్ఫీ వీడియో తీయడం కలకలం సృష్టిస్తుంది. సెల్ఫీ వీడియోలో అరుణ్ మాట్లాడుతూ ఆన్లైన్ లాటరీ టికెట్లు కొని మోసపోయామని అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. కానీ తాము లేకపోతె తమ పిల్లల్ని ఎవరూ చూడరనే అనుమానంతో పిల్లలకు విషమిచ్చి పిల్లలు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూ చనిపోతున్న వీడియోను సెల్ఫీ వీడియో తీసాడు. ముగ్గురు తల్లి ఒడిలోనే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడుస్తున్న చిన్నారులను చూస్తే ఎంతటి కఠిన హృదయాలకైనా కన్నీళ్లు రావడం ఖాయం. ఇలా లాటరీ మోజులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చనిపోవడం పట్ల పలువురు కంటతడి పెడుతున్నారు.

అసలు తాము చేసిన తప్పులకు ముక్కుపచ్చలారని పసిపిల్లలను చంపే హక్కు ఆ తల్లిదండ్రులకు ఎవరిచ్చారు.? ఆ పిల్లలు చేసిన నేరం ఏంటి? లాటరీ మోజులో పడి తన ఆదాయం మొత్తం లాటరీ టికెట్లకే పెట్టిన అరుణ్ కి అసలు ఎందుకంత అత్యాశ? తాను చేసిన ఈ అనాలోచిత పని ఖరీదు ఐదు ప్రాణాలు. అందుకే పెద్దలు అంటారు.. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని. ఈ ఘటనపై దుమ్మెత్తి పోయాల్సింది లాటరీ టికెట్లు అమ్ముతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్నా? ఆ లాటరీ టికెట్లు అమ్మిన సంస్థనా..? లేదా అత్యాశతో తన సంపాదన మొత్తం ఆ టికెట్లపై పెట్టినా అరుణ్ నా.. ? ఇప్పుడెన్ని మాట్లాడుకున్నా ఆ చనిపోయిన ఐదు ప్రాణాలు తిరిగిరావు. కానీ అదృష్టాన్ని నమ్ముకుని తమ కష్టార్జితం మొత్తాన్ని బెట్టింగులు,లాటరీలకు తగలేసే పిచ్చి జనాలకు ఈ సంఘటన ఒక గుణపాఠంగా మిగిలిపోతుంది.

మీడియా కూడా కొన్ని విషయాల్లో దిగజారిపోతోంది. అరుణ్ కుటుంబలో చిన్నారులు చనిపోతున్న వీడియోలను కొన్ని మీడియా సంస్థలు కనీసం బ్లర్ చేయకుండా ప్రసారం చేయడం దిగజారుతున్న మీడియా విలువలను ఎత్తి చూపుతున్నాయి. కనీస విలువలు పాటించని జర్నలిజం వల్ల ఉపయోగం ఏమిటి?  ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆన్లైన్ లో జరిగే బెట్టింగులు,లాటరీల పేరుతో జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. అప్పుడే మరెందరో అరుణ్ లాంటి కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటారు. ముందు ప్రజల్లో అదృష్టం కొద్దీ వచ్చే సంపద, ఆయాచితంగా వచ్చే ధనం తమ దగ్గర నిలబడదు అనే నిజాన్ని గుర్తించాలి. బెట్టింగుల్లో లాటరీలో సంపద వస్తే అది ఇంకొకడు కష్టించి సంపాదించిన సొమ్మని వాడి కష్టాన్ని మనం దోచుకోకూడదు అనే ఆలోచన ప్రజల్లో కలిగిన రోజున ఈ బెట్టింగులు లాటరీలు ఆగుతాయి.

గెలుపుకోసం జరిగే గుర్రపు పందేలలో ఓడిన గుర్రాన్ని యజమాని ఎక్కువగా చంపే అవకాశం ఉంది. అరుణ్ విషయంలో జరిగింది కూడా అదే. తన గెలుపు పందెంలో కుటుంబాన్ని అంతం చేసేసాడు. ఈ రేసులు, బెట్టింగులు మనిషిని ప్రాణం తీయడానికైనా, ప్రాణం తీసుకోవడానికైనా ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ ఘటనను ప్రభుత్వాలు తీవ్రమైన నేరంగా పరిగణలోకి తీసుకుని లాటరీలు బెట్టింగులు నిర్వహించే సంస్థలపై చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో మరికొన్ని కుటుంబాలు బెట్టింగులు లాటరీలబారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనిషిలో ఆశ ఎన్నటికీ చావదు.. ఆ ఆశ ఉన్నంతకాలం బెట్టింగులు లాటరీలు ఆగవు. బెట్టింగులు లాటరీలు ఉన్నంతకాలం ఆత్మహత్యలు, హత్యలు కూడా ఆగవు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp