వైసీపీలో ముదురుతున్న వ‌ర్గ‌పోరు

By Raju VS Feb. 25, 2020, 08:45 pm IST
వైసీపీలో ముదురుతున్న వ‌ర్గ‌పోరు

సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసి అధికారం చేజిక్కించుకున్న త‌ర్వాత వైసీపీ నేత‌ల్లో ఎక్క‌డా లేని ధీమా క‌నిపిస్తోంది. వ‌రుస‌గా ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు త‌మ‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కొన‌సాగిస్తాయ‌నే విశ్వాసం అనేక‌మందిలో క‌నిపిస్తోంది. అందుకు తోడుగా అధికారం కార‌ణంగా ద‌క్కిన ద‌ర్పం ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆ క్ర‌మంలోనే నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్యం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో పార్టీ ప‌లుచ‌న‌వుతున్న తీరుని గుర్తిస్తున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. వ‌ర్గ‌పోరుతో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య పెరుగుతున్న అంత‌రాలు కార‌ణంగా జ‌నంలో అపోహ‌లు పెరుగుతున్న విష‌యం గ‌మ‌నంలోకి తీసుకుంటున్న దాఖ‌లాలు లేవు.

ఏపీలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో ఎవరు పై చేయి సాధిస్తే వారిదే అధికార పీఠం అనే నానుడి ప‌దే ప‌దే రుజువ‌వుతోంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో జిల్లాలో కేవ‌లం 5 సీట్లు మిన‌హా 14 స్థానాలను జ‌గ‌న్ సేన ద‌క్కించుకుంది. కానీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌ర్గ‌పోరు ముదురుతోంది. రామ‌చంద్రాపురంలో తోట త్రిమూర్తులు రాక‌తో అక్క‌డి వ్య‌వ‌హారం ఇటీవ‌ల చెప్పుల‌తో దాడి వ‌ర‌కూ సాగింది. ఇప్ప‌టికే డిప్యూటీ సీఎం పిల్లి బోస్, ఎమ్మెల్యే వేణు మ‌ద్య విబేధాలు కొన‌సాగుతున్నాయి. త్రిమూర్తులు రాక‌తో ఇది మూడుముక్క‌లాట‌గా మారింది.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఎంపీ మార్గాని భ‌ర‌త్, కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్ జ‌క్కంపూడి రాజా మ‌ధ్య జ‌గడం రాజుకుంటోంది. బ‌హిరంగంగానే ఈ ఇద్ద‌రు యువ‌నేత‌లు పైచేయి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలుండ‌డంతో అక్క‌డ ప‌ట్టుకోసం ఈ ఇద్ద‌రు పోటీప‌డుతున్నారు. రాజాన‌గ‌రం ఎమ్మెల్యేగా ఉన్నా రాజా త‌న నియోజ‌క‌వ‌ర్గంతో పాటుగా త‌మ్ముడు, త‌ల్లి పేరుతో మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌ర్చీఫ్ వేసే య‌త్నం చేయ‌డంతో రౌతు సూర్య‌ప్ర‌కాశ‌రావు, శ్రీఘాకోళ్ల‌పు శివ‌రామ‌సుబ్ర‌హ్మ‌ణ్యం. ఆకుల స‌త్య‌నారాయ‌ణ వంటి నేత‌లంతా కుత‌కుత‌లాడుతున్నారు. అయితే అధికారం ఉండ‌డం, జ‌గ‌న్ తో స‌న్నిహిత సంబంధాలుండ‌డంతో మార్గాని భ‌ర‌త్ ద్వారా రాజాకి చెక్ పెట్టించేందుకు వారంతా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ముంగిట వైసీపీకి పెద్ద స‌మ‌స్య‌గా మారే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.

పెద్దాపురంలో గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన తోట వాణీ, ప్ర‌స్తుత కోఆర్డినేట‌ర్ ద‌వులూరి దొర‌బాబు వ‌ర్గాల మ‌ధ్య పొంత‌న లేదు. స‌ఖ్య‌త క‌నిపించడం లేదు. చెరో దారిలో పార్టీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. పిఠాపురంలో ఎంపీ వంగా గీత‌, ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు మ‌ధ్య ఆధిప‌త్యం కోసం ఆరాటం క‌నిపిస్తోంది. గ‌తంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించిన సీటులో సొంత వ‌ర్గంతో వంగా గీత వ్య‌వ‌హారాలు ప్ర‌స్తుత ఎమ్మెల్యేకి గిట్ట‌డం లేదు. అమ‌లాపురంలో ఎంపీ చింతా అనురాధ, మంత్రి విశ్వ‌రూప్ మ‌ధ్య ఎన్నిక‌ల ముందు నుంచీ క‌నిపిస్తున్న విబేధాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. అన్నింటా ఆధిప‌త్యం కోసం ఇరువురు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కార్య‌క‌ర్త‌ల‌ను ఇర‌కాటంలో నెడుతున్నాయి. రాజోలులో ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ అన‌ధికారికంగా వైసీపీ నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో బొంతు రాజేశ్వ‌ర రావు, ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ గా ఉన్న పెద‌పాటి అమ్మాజీ మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఇటీవల అంత‌ర్వేది దేవ‌స్థానం క‌మిటీ విబేధాలు ర‌చ్చ‌కెక్కాయి

ఇలా జిల్లాలో స‌గం సీట్ల‌లో వైఎస్సార్సీపీ అంత‌ర్గ‌త వేడి ఏకంగా పార్టీ పెద్ద‌ల ముందే బ‌య‌ట‌ప‌డుతోంది. మిగిలిన స్థానాల్లో చాప‌కింద‌నీరులా ఈ వ‌ర్గ‌పోరు సాగుతోంది. దాంతో స్థానిక ఎన్నిక‌ల్లో ఈ వ్య‌వ‌హారాలు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే ప్ర‌మాదం ఉంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. స‌కాలంలో చ‌క్క‌దిద్దుకోక‌పోతే చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకునే ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp