వారి టెన్షన్‌ తీరింది..!

By Jaswanth.T Dec. 25, 2020, 10:52 am IST
వారి టెన్షన్‌ తీరింది..!
మందుల బాబుల టెన్షన్‌ తీరింది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో కర్ఫ్యూ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ మెస్సేజ్‌ హల్‌ఛల్‌ చేసింది. దీంతో మందుబాబులకు ఒకటే టెన్షన్‌ పట్టుకుంది. కర్ఫ్యూ ఉంటుందా? ఉంటే ఎప్పటి వరకు? ఏ టైమింగ్స్‌లో పెడతారు? ఇలా కన్పించిన వాళ్ళందర్నీ ఒకటే ఎంక్వైరీలు చేసేస్తున్నారు. కొందరు ఔత్సాహిక మందుబాబులు ఇంకొంచెం ముందుకెళ్ళి ఎక్సైజ్, పోలీసు కార్యాలయాలకు ఫోన్లు చేసి మరీ సమాచారం అడిగే ప్రయత్నం చేసారు. దీంతో ఆయా శాఖల సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఎవరో పెట్టిన మెస్సేజ్‌కు వీళ్ళంతా మా బుర్రలు తినేస్తున్నారంటూ వాపోయేవారు.

దీనికి ఎట్టకేలకు ఎక్సైజ్‌శాఖ ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. మద్యం షాపులు, బార్లకు ఎటువంటి అదనపు సమయం ఉండదని, ఎప్పటి మాదిరిగానే నిర్ణీత సమయాల మేరకు తెరుస్తారని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఒక ప్రకటనలు స్పష్టం చేసింది. దీంతో మందు ప్రియులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నటై్టంది. మద్యం షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు, బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా మహారాష్ట్ర, తెలంగాణాల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతుల్లేవని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించేసాయి. కర్నాటక సైతం ముందు కర్ఫ్యూ అని ప్రకటించినా, ఆ తరువాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నందున మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయన్నది తేలాల్సి ఉంది.

ఇప్పటికే కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై భిన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp