Ex.MLA Usharani- చిరంజీవిని ఓడించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడేమి చేస్తున్నారు?

By Raju VS Nov. 30, 2021, 08:00 pm IST
Ex.MLA Usharani- చిరంజీవిని ఓడించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడేమి చేస్తున్నారు?

అధికార పార్టీకి అదనపు బలం చేకూరుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ వైఎస్సార్సీపీలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ పాలకొల్లులో నిమ్మల రామానాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చెందిన గుణ్ణం నాగబాబు ఇటీవల వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి  వైఎస్సార్సీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె కూడా వైఎస్సార్సీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తన వారసులతో కలిసి జగన్‌తో భేటీ అవుతారని సమాచారం.

2009 ఎన్నికల్లో ఆమె సంచలన విజయం సాధించారు. ప్రజారాజ్యం అధినేతగా బరిలో దిగిన చిరంజీవిని సొంత ప్రాంతంలో ఓడించి రాజకీయంగా జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందారు. వైఎస్సార్ నాయకత్వంలో అప్పట్లో  చిరంజీవికే చెక్ పెట్టిన ఘనత సొంతం చేసుకున్న ఉషారాణి ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించలేదు. వైశ్య కులస్తురాలయిన ఉషారాణికి పాలకొల్లులో మంచి గుర్తింపు ఉంది. వ్యాపారాలతో పాటుగా పట్టణ వ్యవహారాలలో వారి కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె రాక వైఎస్సార్సీపీకి అదనపు బలం అవుతుందని భావిస్తున్నారు. రూరల్ లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ పట్టణంలో ఆదరణతో గట్టెక్కిన రామానాయుడికి ఈసారి ఎదురీత తప్పని పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. రూరల్ మండలాలతో పాటుగా అర్బన్ లో కూడా నిమ్మలకు చెక్ పెట్టేందుకు ఈ పరిణామాలు ఉపయోగపడతాయని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు.

కాపు నేతలుగా డాక్టర్ బాబ్జీ, గుణ్ణం నాగబాబు, బీసీ వర్గానికి చెందిన మేకా శేషుబాబు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ తో పాటుగా ఇప్పుడు వైశ్య కులం నుంచి బంగారు ఉషారాణి కూడా తోడయితే వైఎస్సార్సీపీకి అవకాశాలు మరింత మెరుగవుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి బంగారు ఉషారాణికి ఓ సందర్భంలో టీడీపీ నేతలు ఆహ్వానం పలికారు. ఆమె స్పందిస్తుందని ఆశించారు. కానీ ఆమె మనసు వైఎస్సార్సీపీ వైపు ఉండడంతో త్వరలోనే ముహూర్తం చేసుకుని జగన్ ని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాలకొల్లు రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా భావించాలి. కొత్త సమీకరణాలకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.
నాయకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలో సమన్వయ సమస్య వస్తుంది. గత ఎన్నికల్లో కూడా గుణ్ణం నాగబాబు చివరి నిమిషంలో టికెట్ రాలేదని పార్టీ మారడం, జనసేన అభ్యర్థిగా రంగంలో ఉండడమే వైఎస్సార్సీపీ ఓటమికి ప్రధాన కారణం. దాంతో వచ్చే ఎన్నికల్లో ఇంత మంది పెద్ద నేతలందరినీ సమన్వయం చేసి ఎలా నడిపిస్తారనే దానిని బట్టి పాలకపక్షం  ఫలితం సాధిస్తుందని చెప్పవచ్చు.

Also Read : Nadendla Manohar, One Time Settlement - వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్‌..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp