టీడీపీకి సీనియర్‌ నేత గుడ్‌ బై

By Kotireddy Palukuri Sep. 27, 2020, 04:15 pm IST
టీడీపీకి సీనియర్‌ నేత గుడ్‌ బై

తెలుగుదేశం పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులు, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వకర్త చొప్పన నేతల్ని నియమించిన రోజే ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్‌ నేత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. విజయనగరం జిల్లా సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూ రావు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.

పార్టీ వీడడానికి గల కారణాలను గద్దె బాబూరావు వెల్లడించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదన్నారు. 2004 నుంచి తనను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీలో భవిష్యత్‌ లేదనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీలో పరిస్థితులు బాగోలేవని, ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరని గద్దె బాబూరావు వ్యాఖ్యానించారు. 

గద్దె బాబూ రావు రెండు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లోనూ చీపురుపల్లి నుంచి బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో గద్దె బాబూరావుకు టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. ఈ ఎన్నికల్లో కిమిడి మృణాళినికి చంద్రబాబు టిక్కెట్‌ ఇచ్చారు. రెండు పర్యాయాల తర్వాత మళ్లీ టీడీపీ అక్కడ గెలిచింది. 2019లో తిరిగి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యానారాయణ టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై గెలుపొందారు. కాగా, గద్దె బాబూ రావు ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పని చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp