అధికారులకు పుల్లారావు ప్రతీకార బెదిరింపులు

By Amar S Feb. 03, 2020, 08:34 am IST
అధికారులకు పుల్లారావు ప్రతీకార బెదిరింపులు

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పుల్లారావు ఎలాంటి వ్యాఖ్యలు చేసారో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు.

తాను మంత్రిగా పనిచేసి కూడా ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయానో తెలుసుకోలేకపోతున్నారు. తన సొంత సామాజిక వర్గానికి కంచుకోటగా ఉండి గత 50 ఏళ్లుగా తన సామాజిక వర్గానికి చెందిన వారిని కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో తాను ఎందుకు ఓడిపోయారో అర్ధం చేసుకోలేకపోతున్నారు. మంత్రిగా తనకెన్నో అధికారాలు అవకాశాలు ఉన్న పుల్లారావు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి తన నోటి దురుసు, అహంభావపూరిత వ్యాఖ్యలు కూడా ఒక ప్రధాన కారణమని ఇప్పటికీ తెలుసుకోలేదు..

తాజాగా పుల్లారావు మాట్లాడుతూ తాము (టీడీపీ) మరోసారి అధికారంలోకి వస్తే ప్రతీకారమేననీ .. ఎవ్వరినీ వదిలేది లేదనిబెదిరింపులకు దిగాడు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రివేంజ్ తీసుకోవడమే తన లక్ష్యమని అన్నారు. మొదటి ప్రాధాన్యత రివేంజ్ అని, రెండోది అభివృద్ధి అన్నారు.. ఇప్పుడు తమపై నాలుగు కేసులు పెడితే.. తర్వాత 10 కేసులు పెడతామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మన దమ్మేంటో ఈసారి చూపిద్దామని, అధికారంలోకి వస్తే ఎంతటి అధికారినైనా వదిలేది స్పష్టం చేశారు.

పుల్లారావు అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో రాజధానిలో భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అగ్రిగోల్డ్ స్కామ్ లోనూ పుల్లారావు హస్తం ఉందని, మంత్రిగా ఉన్నప్పుడు పత్తి కొనుగోళ్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆధారాలు కూడా లభించడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.. ఈ క్రమంలో మాజీ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికారులను భయపెట్టడానికి, లేదా తను భయపడటం లేదని చెప్పుకోవటానికో ఇలా మాట్లాడినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు.

ఏదేమైనా పుల్లారావు గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేసి నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నాడు. గతంలో ట్రాక్టర్ పై కూర్చుని ఆఫీసరా డాష్ ఆ (ఒక రాయలేని బూతు) ను ప్రత్తిపాటి ఉపయోగించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. చాలా సందర్భాల్లో అత్యంత వికటాట్టహాసం ప్రదర్శించడం, అధికార దర్పంతో దారుణమైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అప్పటి గవర్నర్ నరసింహన్ ను, ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ నుద్దేశించి పుల్లారావు అనేక సందర్భాల్లో దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఓసారి పుల్లారావు భార్య కారులో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తున్నపుడు మాడ్గులపల్లి టోల్‌ప్లాజా దగ్గర టోల్‌ టాక్స్ చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపడంతో ఆమె నేను మంత్రి భార్యను.. నా కారుకే టోల్‌ ఫీజు అడుగుతారా.. నా కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉంది అంటూ హల్ చల్ చేశారు. స్టిక్కర్‌ టైం దాటిందని, రుసుము చెల్లించకుంటే వేళ్లేది లేదని సిబ్బంది చెప్పినా టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలా పుల్లారావు ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దారుణంగా ఓడిపోయారు. అయినా ఇప్పటికే తెలుసుకోకుండా అవే బరితెగింపు వ్యాఖ్యలు చేస్తుండటం ఎలా అర్థం చేసుకోవాలి.?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp