మాజీ మంత్రి పితాని సంచలన వ్యాఖ్యలు .. ఈఎస్‌ఐ స్కాం నిందితులకు కష్టకాలం

By Kotireddy Palukuri Jul. 10, 2020, 07:18 pm IST
మాజీ మంత్రి పితాని సంచలన వ్యాఖ్యలు .. ఈఎస్‌ఐ స్కాం నిందితులకు కష్టకాలం

రూ.150 కోట్ల ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి అచ్చెం నాయుడు, అధికారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మరింత ఇరకాటంలో పెట్టేలా ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పితాని వెంకట సురేష్‌ తండ్రి, కార్మిక శాఖ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా వ్యాఖ్యలతో ఈ కేసులో అటు ఏసీబీకి, ఇటు రాజకీయ ప్రత్యర్థులకు పితాని ఆయుధాన్ని ఇచ్చినట్లైంది. ఈ రోజు పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన మురళీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పితాని కుమారుడు వెంకట సురేష్‌ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో పితాని స్పందించారు.

‘‘ నన్ను ఏమీ చేయలేక ముద్దాయిలను బెదరించి తన కుమారుడిని ఈ కేసులో ఇరికించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. ఇలా ఆశ్రయించడంలో తప్పు లేదు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే.’’ అని పితాని వ్యాఖ్యానించారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే చివరగా పితాని బాంబు లాంటి వ్యాఖ్యను పేల్చారు. ‘‘ రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణం’’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఓ పక్క రాజకీయ కక్ష సాధింపు అంటూనే మరో పక్క రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణం అని.. ఈఎస్‌ఐ స్కాం జరిగిందని పితాని చెప్పకనే చెప్పారు.

ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెం నాయుడు కూడా తాను కొనుగోలు ప్రతిపాదనలను పరిశీలించాలని లేఖ మాత్రమే ఇచ్చానని, కొనుగోలు వ్యవహారాలు అన్నీ అధికారులే చూసుకుంటారని, తనకేమీ సంబంధంలేదని ఏసీబీ విచారణలో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. పరిశీలించాలని చెప్పాను గానీ.. ఈ స్కాంలో తనకేమీ సంబంధం లేదని అచ్చెం నాయుడు తాను ఇచ్చిన సిఫార్సు లేఖను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పితాని.. రాజకీయాల్లో పైరవీలు సర్వసాధారణం అని చెప్పడం అచ్చెం నాయుడును ఇరకాటంలో పడేస్తుందనడంలో సందేహం లేదు.

తాము నిజాయతీగా ఉన్నామని, ఏ తప్పు చేయలేదని గత నెల 22వ తేదీన పితాని సత్యనారాయణ రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. తాను కనిపించకుండా పోయాయని వచ్చే వార్తల్లో నిజం లేదన్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని కూడా చెప్పారు. అలాంటి ప్రకటన చేసిన పితాని సత్యనారాయణ ఈ రోజు స్వరం మార్చి.. రాజకీయ పైరవీలు సర్వసాధారణం అని చెప్పడం గమనార్హం.

అంతేకాకుండా ఏసీబీ విచారణకు సహకరిస్తానని చెప్పిన మాజీ మంత్రి.. ప్రస్తుతం తన కుమారుడును అజ్ఞాతంలోకి పంపి తన వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పైగా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లడం తప్పేమీ కాదంటూ చెప్పడంతో ఈ స్కాంలో తమ పాత్రపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమయ్యాయనే భావనలో పితాని ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. రాజకీయ సిఫార్సుల ద్వారా పైరవీలు చేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన వ్యవహారంలో విజిలెన్స్, ఏసీబీ విచారణలను రాజకీయ కక్ష సాధింపు అంటూ పితాని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp