మంత్రి నాని అనుచరుడి హత్యలో కొల్లు రవీంద్రే సూత్రధారి.. వెల్లడించిన కృష్ణా ఎస్పీ

By Kotireddy Palukuri Jul. 04, 2020, 12:46 pm IST
మంత్రి నాని అనుచరుడి హత్యలో కొల్లు రవీంద్రే సూత్రధారి.. వెల్లడించిన కృష్ణా ఎస్పీ

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్యలో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రే సూత్రధారి అని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ప్రధాన నిందితుడు చింతా చిన్ని ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా టెక్నికల్, ఇతర అంశాలను విచారించిన తర్వాతనే కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేశామని తెలిపారు. విచారణకు రావాలని తాము నోటీసు జారీ చేసిన తర్వాత కొల్లు రవీంద్ర తన ఇంటి వెనుక నుంచి నిచ్చెన సహాయంతో గొడ దూకి పారిపోయారని ఎస్పీ తెలిపారు. నాలుగు నెలలుగా మోకా భాస్కర రావు హత్యకు ప్లాన్‌ చేస్తున్నారని చెప్పారు. హత్య జరిగిన రోజుకు నాలుగు రోజుల ముందు ప్రధాన నిందితుడు చింతా చిన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారని చెప్పారు. ఆ భేటీ సమయంలో రవీంద్ర పీఏ కూడా వారితో ఉన్నారని తెలిపారు.


‘‘ఆరేడేళ్ల నుంచి మోకా భాస్కర రావుకు, చింతా చిన్నికి మధ్య రాజకీయ, సామాజిక వివాదాలు ఉన్నాయి. ఇద్దరూ రెండు పార్టీల తరఫున మచిలీపట్నం 24వ వార్డు నుంచి పోటీ పడుతున్నారు. 2013లో కూడా మోకా భాస్కర రావును చంపాలని చింతా చిన్ని ప్లాన్‌ చేశారు. అయితే ఆ ఘటనలో మోకా భాస్కర రావు తప్పించుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం, 24వ డివిజన్‌ నుంచి చింతా చిన్ని వదిన కార్పొరేటర్‌గా గెలవడంతో వారు రాజకీపరమైన పనులపై ఫోకస్‌ పెట్టి వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల వారి అధికారం పోవడం, మోకా భాస్కర రావు రాజకీయంగా, సామాజికంగా ఆధిత్యం చెలాయిస్తుండడంతో అతన్ని అంతం చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో స్థానికంగా గొడవులు కూడా జరిగాయి. చింతా చిన్ని కొల్లు రవీంద్రతో భేటీ అయి మోకా భాస్కర రావును అంతంచేస్తామని, మాకు మీ అండ కావాలని అడిగారు. అయితే ఇది సరైన సమయం కాదని ఆయన వారించారు. సరైన సమయంలో నేను చెబుతానని, అప్పుడు ప్లాన్‌ అచరణలో పెడదామని కొల్లు రవీంద్ర చెప్పారు.

హత్యకు 15 రోజుల క్రితం కూడా మోకా భాస్కర రావు, చింతా చిన్ని వర్గాల మధ్య గొడవ జరిగింది. అప్పుడు మళ్లీ చింతా చిన్ని కొల్లు రవీంద్రతో భేటీ అయ్యారు. మోకా భాస్కర్‌ రావును అంతం చేసే విషౖయె చర్చించారు. ఎలా చంపాలో ప్లాన్‌ చేశారు. హత్య జరిగిన రోజుకు నాలుగు రోజులు ముందు చివరిగా కొల్లు రవీంద్రతో ఆయన ఇంట్లో చింతా శ్రీను ఒంటిరిగా సమావేశయ్యారు. హత్యకు ఒకే చెప్పిన కొల్లు రవీంద్ర తన పేరు మాత్రం బయటకు రానీయొద్దని చిన్నితో చెప్పారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మిస్‌ కాకూడదని చెప్పారు. మిస్‌ అయితే మోకా భాస్కర రావు మీ అందరినీ అంతం చేస్తాడని హెచ్చరించారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకుండా ప్లాన్‌ చేయాలని చెప్పారు. ఇకపై తనతో మాట్లాడాలంటే నేరుగా తనకు కాల్‌ చేయొద్దని.. తన పీఏలు రిజ్వాన్, నాగరాజు లేదా తన చుట్టూ ఉండే వారికి ఫోన్‌ చేయాలని చెప్పారు. చింతా చిన్ని ఇలాగే చేశారు.

జూన్‌ 28వ తేదీన ప్లాన్‌ చేశారు. అయితే అమలు చేయలేకపోయారు. 29వ తేదీన చేపల మార్కెట్‌లో ప్లాన్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో చేపల మార్కెట్‌లో కార్యకలాపాలు జరగడంలేదు. రినోవేషన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రతి రోజు మోకా భాస్కర రావు ఆ పనులు పరిశీలించేందుకు ఒంటరిగా వస్తున్నారు. అక్కడ అయితే ప్లాన్‌ విజయవంతంగా అమలు చేయొచ్చని నిర్ణయించుకున్నారు. మార్కెట్‌లో తాను ఉంటే అందరూ గుర్తు పడతారని భావించిన చింతా చిన్ని.. తన బంధువులైన పులిగాడు, మరో జువనైల్‌కు ఎలా చంపాలో శిక్షణ ఇచ్చారు. ఎక్కడ పొడిస్తే చనిపోతాడో చెప్పారు. బాడిపై మాత్రమే దాడి చేయాలని చెప్పాడు. వారు విచక్షణారహితంగా మోకా భాస్కర్‌ను చంపారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు.

హత్య 11:45 గంటలకు జరిగింది. హత్య జరిగిన 15 నిమిషాల తర్వాత చింతా చిన్ని ఏ2 అయిన చింతా పులిగాడు ఫోన్‌ నుంచి కొల్లు రవీంద్రకు ఫోన్‌ చేశారు. అన్నా.. అంతా ఓకే.. ఫినిష్ అని చెప్పాడు. అంతా ఓకే కదా.. మీరందరూ జాగ్రత్తగా ఉండండి..అంటూ కొల్లు రవీంద్ర చింతా చిన్నికి చెప్పారు. ఆ సమయంలో కొల్లు రవీంద్ర జిల్లా జడ్పీ కార్యాలయంలో ఉన్నారు. ఫోన్‌ వచ్చినప్పుడు పక్కకు వచ్చి మాట్లాడారు. కొన్ని గంటల తర్వాత చింతా చిన్ని కొల్లు రవీంద్రతో వారి పీఏ ఫోన్‌కు కాల్‌ చేసి మాట్లాడారు.

చింతా చిన్న ఇచ్చిన వాగ్మూలంతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేయలేదు. టెక్నికల్, సర్క్యూమటెన్సెస్‌ ఎవిడెన్స్‌ కూడా సేకరించిన తర్వాత కొల్లు రవీంద్ర పాత్రను నిర్థారించుకున్న తర్వాతే ఆయనును విచారించాలని నోటీసు జారీ చేశాం. ఉదయం మేము వెళ్లే లోపు ఆయన తన ఇంటి వెనుక గోడ నుంచి దూకి పారిపోయారు. తప్పు చేస్తే పారిపోవాల్సిన అవసరం ఏముంది..? ధైర్యంగా విచారణ ఎదుర్కునేవారు. సాయంత్రం కూడా వారి ఇంటికి వెళ్లి సోదాలు చేశాం. కొల్లు రవీంద్రను పట్టుకునేందుకు ఐదు సెర్చ్‌ పార్టీలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్, విశాఖ, చెన్నై ఇలా పలు మార్గాలపై నిఘా పెట్టాం. కాకినాడలో కొల్లు రవీంద్ర కదలికలు ఉన్నట్లు సమాచారం వచ్చింది. నిన్న రాత్రి తుని సమీపంలోని సీతారామపురం వద్ద తూర్పుగోదావరి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశాం. మేజిస్ట్రేట్‌ ముందు హాజరపరిచాం’’ అని ఎస్పీ రవీంద్రనాథ్‌ హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్రను సమగ్రంగా వివరించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp