దేవినేని లెక్చర్లు.. రాజకీయాల్లో నూతన ఒరవడి..

By Karthik P Jan. 20, 2021, 07:00 am IST
దేవినేని లెక్చర్లు.. రాజకీయాల్లో నూతన ఒరవడి..

అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు సుద్దులు చెప్పడం కొంత మంది రాజకీయ నేతలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ఈ తరహా నేత ఒకరు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులను ఏకవచనంతో సంభోదిస్తూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సదరు నేతకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడంతో తత్వం బోధపడుతోంది. అయన మరెవరో కాదు.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. మంత్రి కొడాలి నాని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటూ దేవినేని ఉమా ఫీలవుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ వాపోయారు. పైగా బాధ్యత కలిగిన మంత్రి ఇంత దారుణంగా మాట్లాడడం సరికాదంటూ సుద్దులు చెబుతున్నారు. ఆఖరుకు సీఎం వైఎస్‌ జగన్‌ దీనికి బాధ్యత వహించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

గతం మరచారా...?

రాజకీయాల్లో సద్విమర్శలు, విధానపరమైన అంశాలపై అభ్యంతరాలు తెలపడం ప్రతిపక్షాల విధి. అయితే కొంత మంది రాజకీయ నాయకులు పరిధి దాటి వ్యక్తిగత విమర్శలకు దిగుతుంటారు. ఇందులో టీడీపీకి చెందిన పలువురు నాయకులది అందెవేసిన చేయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి, ఆ పార్టీ నేతల వరకూ చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చెప్పనలవి కావు. సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా టీడీపీ నేతలు తమ నోటికి పని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేస్తే.. టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తూ.. వ్యక్తిగత, కుటుంబపరమైన అంశాలపై కూడా దుష్ప్రచారం చేశారు. అసెంబ్లీలోనూ అదే తీరున వ్యవహరించారు.

కొత్త సాంప్రదాయానికి శ్రీకారం..

సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేయడంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ముందు వరసలో ఉంటారు. తనను వ్యక్తిగతంగా విమర్శించినా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నడూ వారిపై వ్యక్తిగతమైన విమర్శలు చేయలేదు. హుందాగా రాజకీయాలు చేశారు. కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సహా దేవినేని ఉమా అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగతమైన విమర్శలు, అసభ్యపదజాలంతో దూషణలు చేశారు. అయితే గతం మరిచిపోయినట్లుగా వ్యవహరిస్తున్న దేవినేనికి... ఇప్పుడు తమ అధినేత చంద్రబాబు, తనను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యలు, విమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వాపోతున్నారు. పైగా ఎలా మాట్లాడాలో.. ఎలా మాట్లాడకూడదో లెక్చర్లు ఇస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా మంత్రి తీరు సరిగాలేదంటూ దీక్షల పేరుతో హల్‌చల్‌ చేస్తూ వార్తల్లో నిలిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేసే పరిస్థితి నుంచి.. తనను తిట్టారంటూ దీక్షలు చేయడం బహుశా తెలుగు రాజకీయాలలో ఇదే తొలిసారి. తెలుగు రాజకీయాల్లో సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన దేవినేని ఉమా.. రాబోయే రోజుల్లో ఇంకా ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp