బాబు గారు చెబుతున్నారు నమ్మండి.. కేసులు పెడతారని ప్రజలు బయపడుతున్నారట..!!

By Kotireddy Palukuri Feb. 14, 2020, 02:39 pm IST
బాబు గారు చెబుతున్నారు నమ్మండి.. కేసులు పెడతారని ప్రజలు బయపడుతున్నారట..!!

40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలు, వ్యాపారుల భద్రత గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ కోర్టు తనను ఆక్షేపించలేదని పాతపాటే పాడిన చంద్రబాబు.. కేసులు పెడతారని ప్రజలు, వ్యాపారులు బయపడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. తనపై కేసులు పెడతారేమోనని బయపడుతున్న చంద్రబాబు.. ఈ మాటను ప్రజల, వ్యాపారుల పేరు పెట్టి మనస్సులో భయాన్ని కొంతమేరకైనా తగ్గించుకుంటున్నారు. ప్రజలు, వ్యాపారుల పై ఎవరు..? ఎందుకు..? కేసులు పెడతారు..? వారిమైనా ఆర్థిక నేరాలు చేశారా..? అనేది మాత్రం చంద్రబాబు సెలవియ్యడంలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెల 6వ తేదీ నుంచి 12 వరకు ఆరు రోజుల పాటు 24 గంటలూ ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పర్సనల్‌ సెక్రటరీ (పీఎస్‌), నారా లోకేష్‌ సన్నిహితులైన టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలల్లో సోదాలు చేశారు. మొత్తం మీద చంద్రబాబు పీఎస్‌ ఇంట్లో 2 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి భాగోతం బయటపడింది.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక వేత్తలైన టీడీపీ ప్రజా ప్రతినిదుల కంపెనీలు, ఇళ్లపై ఐటీ సోదాలు చేస్తే.. దాడులు చేస్తున్నారంటూ అరిచి గోల పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం మౌనం దాల్చారు. స్వయానా తన మాజీ పీఎస్‌పై ఐటీ సోదాలు ఏకభిగిన ఆరు రోజుల పాటు 24 గంటలూ కొనసాగినా ఈ ఆరు రోజుల్లో ఒక్క సారిగాకపోయినా.. ఒకసారైనా.. చంద్రబాబు నోరు విప్పలేదు. రాజధాని, కియా, పెట్టుబడులు, మండలి.. ఇలా అనేక అంశాలపై గత వారం రోజులుగా పలుమార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గంటల కొద్దీ స్పీచ్‌లు దంచిన బాబు.. ఐటీ రైడ్స్‌ గురించి మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడంతో ప్రజలు, మీడియా వర్గాలు ఆశ్చర్యపోయాయి.

తన పీఎస్‌ ఇంట్లో రెండు వేల కోట్ల రూపాలయ అవినీతి భాగోతాన్ని ఐటీ అధికారులు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత మొత్తంలో నగదు లావాదేవీలు జరగడం, పైగా అవన్నీ ఇన్‌ఫ్రా కంపెనీలకు సంబంధించినవి కావడం... దాని వెనుక ఎవరున్నారన్నదీ జగద్విదితమే. ఈ విషయంలో రేపో మాపో తన వద్దకూ ఐటీ వస్తుందని, తాఖీదులు, కేసులు తప్పని అంచనా కొచ్చిన మాజీ సీఎం చంద్రబాబు తన భయాన్ని.. ప్రజల భయంగా చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెడుతున్నారని ప్రజలు, వ్యాపారులు భయపడుతున్నారంటూ.. తనదైన శైలిలో ఆవేదన చెందారని వ్యాఖ్యానిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp