మాజీ చీఫ్ సెక్రటరీ,హైదరాబాద్ చరిత్రకారుడు నరేంద్ర లూథర్ మృతి

By Kranti Jan. 20, 2021, 01:30 pm IST
మాజీ చీఫ్ సెక్రటరీ,హైదరాబాద్ చరిత్రకారుడు నరేంద్ర లూథర్ మృతి

మనుషుల మధ్య మమతలు కరువవుతున్న కాలంలో రాళ్లను ప్రేమించిన మనిషి... రాళ్ల నడుమే నివాసమేర్పర్చుకున్న మనిషి... తన మునివేళ్లతో నగర చరిత్రను ప్రేమగా స్పృషించిన మనిషి.. అక్షరాల్లో హైదరాబాద్ అంతరంగాన్ని ఆవిష్కరించిన మనిషి.... ఆయనే నరేంద్ర లూథర్. విశ్రాంత ఐఏఎస్ అధికారి, చరిత్రకారుడు, రచయిత, ప్రకృతి ప్రేమికుడు నరేంద్ర లూథర్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర లూథర్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు సంతాపం ప్రకటించారు.

పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో మార్చి 23, 1932లో నరేంద్ర లూథర్ జన్మించారు. బాల్యమంతా ప్రస్థుత పాకిస్తాన్ లోని లాహోర్‌లో గడిచింది. స్వాతంత్య్రానంతరం ఆయన కుటుంబం అమృత్‌సర్‌లో స్థిరపడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పంజాబ్‌ యూనివర్సిటీలో నరేంద్ర లూథర్‌కు జూనియర్‌. ఐఏఎస్‌ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1955లో సేవలు ప్రారంభించిన లూథర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు.

గూడూరు డివిజన్‌ సబ్‌కలెక్టర్‌గా పని చేస్తున్నకాలంలో నెల్లూరు జిల్లాలో తుఫాను బీభత్సం సృష్టించింది. ప్రజా రవాణా స్థంభించింది. నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో రైళ్లు తుపానులో చిక్కుకుపోయాయి. జాతీయ రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఆ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీళ్లలో ఈదుకుంటూ అవతలి ఒడ్డు చేరుకుని ప్రయాణికులకు ఆహారం, పునరావాస ఏర్పాట్లు చేశారు నరేంద్ర లూథర్.

రచయితగా

విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌ నగరానికి వచ్చిన నరేంద్ర లూథర్ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్దులయ్యారు. జంట నగరాల చరిత్ర, సంస్కృతిపై పలు రచనలు చేశారు. ఆయన రాసిన హైదరాబాద్ ‌- ఏ బయోగ్రఫి, లష్కర్ ‌- ది స్టోరీ ఆఫ్‌ సికింద్రాబాద్‌, ది ప్రిన్స్‌ ఆఫ్‌ ఫొటోగ్రాఫర్స్‌ రాజా దీన్‌ దయాళ్‌, ప్రిన్స్‌, పోయెట్‌, లవర్‌, బిల్డర్‌ మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా లాంటి రచనలు చరిత్ర పట్ల ఆయనకున్న మక్కువను తెలియజేస్తాయి. ఆయన జీవిత చరిత్రగా వెలువడిన ఏ బొన్సాయి ట్రీ లో తాను పుట్టిపెరిగిన లాహోర్ నగరానికి, హైదరాబాద్ కి గల సారూప్యతలను విడమర్చారు.


చరిత్రకారుడిగా

హైదరాబాద్ నగరంలో నరేంద్ర లూథర్ ది విడదీయరాని బంధం. చరిత్రపై మక్కువతో నగరంపై విస్తృత పరిశోధన చేశారు. నాలుగు వందల ఏళ్ల నగర చరిత్రను పొరపొరలుగా విప్పి చెప్పారు. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలంలో పాలన పరమైన అంశాలతో పాటు చరిత్ర విస్మరించిన ఎన్నో సంగతులను తవ్వితోడారు. హైదరాబాద్ నిర్మాత కులీకుతుబ్ షాపై యానిమేషన్ చిత్రాన్ని నిర్మించి పలువురి ప్రశంసలు పొందారు. నగర సంస్కృతి, సంప్రదాయాలపై పలు డాక్యుమెంటరీలు రూపొందించారు. అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

ప్రకృతి ప్రేమికుడు

అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని నరేంద్ర లూథర్ వ్యతిరేకించారు. నూతన నిర్మాణాల కోసం కొండలు, గుట్టలను ధ్వంసం చేయడం పట్ల కలత చెందారు. ప్రకృతిలో భాగమైనన బండరాళ్లను కాపాడుకోలేకపోతే చరిత్రను కోల్పోతామని హెచ్చరించాడు. సొసైటీ టు సేవ్‌ రాక్స్‌ సంస్థను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న గుట్టలు, రాళ్లను పరిరక్షించడంలో కీలకపాత్ర పొషించారు. నరంలోని గుట్టల ప్రాముఖ్యతను కొత్త తరానికి తెలియజేశారు. బంజారాహిల్స్‌లోని రాతి గుట్టలు, అవి ఏర్పడిన విధానంపై డాక్యుమెంటరీని తీశారు. ‘మార్వెల్స్‌ ఆఫ్‌ నేచర్‌- రాక్‌స్పేప్‌ ఆఫ్‌ తెలంగాణ’ పుస్తకాన్ని రచించారు. ఆయన ఇంటి స్థలంలో ఉన్న రాళ్లను తొలగించకుండానే గృహాన్ని నిర్మించుకొని ప్రకృతిపై ప్రేమను చాటుకున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp