పవన్ కళ్యాణ్ కి మరో షాక్ - జేడీ రాజీనామా

By Kiran.G Jan. 30, 2020, 06:51 pm IST
పవన్ కళ్యాణ్ కి మరో షాక్ - జేడీ రాజీనామా

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. గతంలో జనసేన పార్టీ స్థాపనలో , నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి, పార్టీకి సిద్దాంతాలను, రాజ్యాంగాన్ని ఇజం రూపంలో తయారు చేసిన పవన్ కళ్యాణ్ స్నేహితుడు అయిన రాజు రవితేజ జనసేన పార్టీకి రాజీనామా చేసిన ఘటన మరువక ముందే మరో కీలక నేత మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా జనసేన పార్టీకి రాజీనామా చేసారు.

ఇది నిజంగా పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. ఆ పార్టీ లో చేరిన కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో జనసేన పార్టీ బలహీనపడింది. ఇప్పటికే ముఖ్య నేతలైన చింతల పార్ధసారధి, ఆకుల సత్యనారాయణ, పసుపులేటి సుధాకర్, రావెల కిషొర్ బాబు, మారంశెట్టి రాఘవయ్య, పసుపులేటి రామారావు, అద్దేపల్లి శ్రీధర్ ఇలా కీలకంగా వ్యవ్హరించిన నేతలు ఒకరి తరువాత ఒకరు జనసేనను వదిలిపెట్టారు.

పవన్ కళ్యాణ్ విధానాలతో పొసగక అనేకమంది కీలకనేతలు జనసేనకు దూరమయ్యారు. ముఖ్యంగా రాజు రవితేజ పవన్ కళ్యాణ్ లో వచ్చిన మార్పును బహిరంగంగా విమర్శిస్తూ పార్టీకి దూరం అయిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా పవన్ కళ్యాణ్ వైఖరి వల్లనే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో వెల్లడించారు.

desc_lt_imageపూర్తి జీవితం ప్రజా సేవకే అని అనేక పర్యాయాలు చెప్పి, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ కు నిలకడైన విధి విధానాలు లేవని అందుకే జనసేనకు రాజీనామా చేస్తున్నానని లక్ష్మీనారాయణ వివరించారు. తనకు ఓటు వేసిన వారికి కృతఙ్ఞతలు చెప్తూ, జనసైనికులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానానికి జనసేన తరపున పోటీ చేసిన లక్ష్మి నారాయణ వైసీపీ, టీడీపీల అనంతరం మూడవ స్థానంలో నిలిచారు.

పవన్ కళ్యాణ్ లో నిలకడైన మనస్తత్వం లేదని బహిరంగ రాజీనామా లేఖలో లక్ష్మినారాయణ వ్యాఖ్యానించడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రవర్తనపై అయన గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారని అర్ధం చేసుకోవచ్చు.

జనసేన పార్టీని మళ్ళీ నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు కుదుర్చుకున్నా సరే ఈ రాజీనామాల పర్వం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, చేస్తున్న విమర్శల పట్ల పార్టీ కి దూరమైన నాయకులు బాహాటంగానే విమర్శించారు. దీంతో జనసేనలో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా అంతు చిక్కడం లేదు. ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేన పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు కూడా గతంలో వచ్చాయి.

కానీ ఇలా వరుసగా కీలక నాయకులంతా జనసేన పార్టీకి దూరమవుతుండటం ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నే ప్రశ్నించేలా ఉంది.. దానికి తోడు పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమపై జనసేన కార్యకర్తల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా లక్ష్మి నారాయణ లాంటి కీలక వ్యక్తిని దూరం చేసుకోవడం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు తీరని లోటనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp