ధ‌ర్మాడి స‌త్యం కూడా కాపాడ‌లేడ‌ట‌!

By Sodum Ramana Nov. 15, 2019, 09:08 am IST
ధ‌ర్మాడి స‌త్యం కూడా కాపాడ‌లేడ‌ట‌!

ప్చ్‌...ఎంత మాట‌. ఇంకా టీడీపీ నుంచి పూర్తి బంధాలు, అనుబంధాలు తెంచుకోకుండానే , దానికి భ‌విష్య‌త్ లేద‌ని, మునిగిపోతున్న ఆ పార్టీ ప‌డ‌వ‌ను ధ‌ర్మాడి స‌త్యం కూడా కాపాడ‌లేడ‌ని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్నాడు. గురువారం ఆయ‌న ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో త‌న‌దైన శైలిలో టీడీపీపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. అస‌లు 2029 నాటికి ఏపీలో టీడీపీ అనేదే ఉండ‌ద‌ని తేల్చి ప‌డేశారు.
టీడీపీని ధ‌ర్మాడి స‌త్యం కూడా కాపాడ‌లేడ‌ని వంశీ చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కూ ధ‌ర్మాడి స‌త్యం ఎవ‌రో మ‌రొక్క‌సారి తెల్సుకొందాం. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15న తూర్పుగోదావ‌రి జిల్లా క‌చ్చ‌లూరు వ‌ద్ద రాయ‌ల్ వ‌శిష్ట బోటు మునిగిపోయి ప‌దుల సంఖ్య‌లో స‌జీవ జ‌ల‌స‌మాధి అయ్యారు. అలాగే 13 మంది ఆచూకీ దొర‌క‌లేదు. మ‌రో వైపు బోటు వెలికితీత‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా నేవీ, ఎన్టీఆర్ఎఫ్‌, ఉత్త‌రాఖండ్‌కు చెందిన విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాలు వ‌చ్చి బోటు వెలికి తీసేందుకు స‌ర్వ‌శ‌క్తులు వ‌డ్డాయి. చివ‌రికి బోటును తీయ‌లేక ఆ బృందాల్లోని స‌భ్యులు చేతులెత్తేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏం చేయాలో దిక్కుతోచ‌లేదు. ఈ నేప‌థ్యంలో కాకినాడ‌కు చెందిన ధ‌ర్మాడి స‌త్యం గురించి తెలిసింది. బాలాజీ మెరైన్ సంస్థ అధినేత‌గా ధ‌ర్మాడి స‌త్యానికి తూర్పుగోదావ‌రి జిల్లాలో స‌ముద్రం, న‌దిలో మునిగిపోయిన బోట్లు, ప‌డ‌వ‌ల‌ను వెలికితీయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడ‌ని పేరు. అయితే అత‌ను పెద్ద చ‌దువులేవీ చ‌ద‌వ‌లేదు. కేవ‌లం అత‌నిపై న‌మ్మ‌కంతో రాష్ట్ర ప్ర‌భుత్వం బోటు వెలికితీత‌కు రూ.22.7 ల‌క్ష‌ల‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది.

ధ‌ర్మాడి స‌త్యం బృందం గోదావ‌రిలో బోటు వెలికితీత ప‌నులు మొద‌లు పెట్టింది. ప్చ్‌...ఐదురోజుల పాటు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి స‌త్యం బృందానికి అడ్డంకిగా మారింది. దీంతో వారు వెనుతిరిగారు. ఆ త‌ర్వాత రెండు వారాల‌కు తిరిగి వెలికితీత ప‌నులు మొద‌లు పెట్టారు. ఈ సారి వారి శ్ర‌మ వృథా కాలేదు. మొత్తానికి బోటు మునిగిపోయిన 38 రోజుల‌కు బ‌య‌ట‌కు తీశారు. అంత‌కు ముందు నేవీ, ఎన్టీఆర్ ఎఫ్, ఇత‌ర ప్ర‌భుత్వ సంస్థ‌ల మాదిరిగానే చివ‌రికి వెనుతిరుగుతార‌ని అనుకున్న వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బోటును బ‌య‌ట‌కు తీసి యావ‌త్ భార‌త‌దేశ దృష్టిని ఆక‌ర్షించారు. ధ‌ర్మాడి సేవ‌ల‌ను గుర్తించిన రాష్ర్ట ప్ర‌భుత్వం ఇటీవ‌ల అత‌న్ని వైఎస్సార్ పుర‌స్కారానికి కూడా ఎంపిక చేసింది.
అలాంటి ధ‌ర్మాడికి సైతం టీడీపీ అనే మునిగిపోయే బోటును ర‌క్షించ‌డం చేత‌కాద‌ని వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్యంగ్యంగా అన్నారు. క‌చ్చ‌లూరు బోటు మున‌క‌, టీడీపీ ప‌డ‌వ మున‌క‌, ధ‌ర్మాడి స‌త్యంతో వ‌ల్ల‌భ‌నేని పోల్చి చెప్ప‌డం కాస్తా ఆస‌క్తి రేపుతోంది. ఈ విమ‌ర్శ టీడీపీ నేత‌ల‌కు అరికాలి నుంచి మంట పుట్టిస్తోంది. వంశీపై వారంతా ఘాటైన‌ విమ‌ర్శ‌ల‌కు దిగారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp