పురుగు మందుల దగ్గరే ఆగిన సందేహం..?

By Jaswanth.T Dec. 12, 2020, 11:35 am IST
పురుగు మందుల దగ్గరే ఆగిన సందేహం..?
ఏలూరులో గుర్తు తెలియని అస్వస్థత అంశంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని పలు సంస్థలు చేస్తున్న పరిశోధన పురుగుమందుల అవశేషాల వద్దనే ఆగింది. త్రాగునీటి శాంపిల్స్‌ విషయంలో అంతా సంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే అస్వస్థతకు గురైన వారి రక్తం, యూరిన్‌లలో భార లోహాల అవశేషాలు ఎలా చేరాయన్నదానిపై మాత్రం లోతైన పరిశోధన చేస్తున్నట్లు ఆయా సంస్థలు సీయం వైఎస్‌ జగన్‌తో జరిగిన వీడియో సమీక్షా సమావేశంలో స్పష్టం చేశాయి.

అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? తిరిగి రిపీట్‌ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న రీతిలో లోతైన దర్యాప్తు చేసి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని సీయం జగన్‌ ఆదేశించారు. ఇదిలా ఉండగా ఎన్‌ఐఎస్, ఐఐసీటీ, ఢిల్లీ ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్, సీసీ యంబీ, ఎన్‌డీసీ, ఎన్‌ఐవీ తదితర సంస్థలు నేరుగా ఈ గుర్తు తెలియని అస్వస్థత గుట్టు విప్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీటన్నిటి అనుమానం దాదాపుగా పురుగుమందుల అవశేషాల వద్దనే ప్రాథమికంగా నిలిచింది.

పాలు, కూరగాయల రెండింటి ద్వారాగానీ, ఏదో ఒక్కదాని వల్లగానీ ప్రజల శరీరాల్లోకి భారలోహాలు చేరి ఉంటాయని భావిస్తున్నారు. వీటిని ఖరారు చేసేందుకు కణస్థాయిలో లోతైన దర్యాప్తునకు సిద్ధమయ్యారు. ఈ పరీక్షల్లో కాలం కీలకం కావడంతో సమయం పడుతుందని వివరిస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు ఈ గుత్తు తెలియని అస్వస్థతకు కారణం కాదని ఇంతకు ముందే బహిర్గమైంది. దీంతో మూలకారణం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని సంస్థలతో పాటు, కేంద్ర పరిధిలోని పలు ప్రతిష్ఠాత్మక సంస్థల సహకారాన్ని పొందుతోంది. రానున్న రోజుల్లో ఈ గుట్టును విప్పేందుకు ఆయా సంస్థలు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నాలుగు రోజులు ఒక్క ఊపు ఊపిన బాధితులు రాన్రాను బాగా తగ్గిపోయారు. రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని స్వయంగా ఆసుపత్రులకు వెళ్ళి రోగులను పరామర్శించడంతో పాటు, వారికి అందుతున్న వైద్యం వివరాలను స్వయంగా ఆరా తీస్తున్నారు. సీయం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp