టీడీపీ పరువు తీసిన ఏలూరు ఫలితాలు

By Raju VS Jul. 26, 2021, 04:00 pm IST
టీడీపీ పరువు తీసిన ఏలూరు ఫలితాలు

ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు మునిసిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు నెలల విరామం తర్వాత ఏలూరు మునిసిప్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు రావడంతో చాలామందిలో ఆసక్తి కనిపించలేదు. కానీ ఏలూరు వాసుల తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ఓ సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2019 నాటితో పోలిస్తే ఏపీలో టీడీపీ పునాదులు కోల్పోతున్న తీరుని మరింత బట్టబయలు చేశాయి ఈ ఎన్నికల ఫలితాలు.

ఆదివారం వెలువడిన ఫలితాల్లో 94 శాతం స్థానాలు వైఎస్సార్సీపీ పరం అయ్యాయి. కేవలం 3 స్థానాలతో 6 శాతం సీట్లను టీడీపీ దక్కించుకుంది. అది కూడా ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, సీపీఐ సహా వివిధ పార్టీల మద్ధతుతో కలిసి పోటీ చేసిన తర్వాత. ఇక ఓట్ల శాతం చూస్తే టీడీపీ కుదేలవుతున్న తీరు సుస్పష్టంగా చాటుతోంది. 2019 ఎన్నికల్లో ఏలూరు నగర అసెంబ్లీ స్థానంలో టీడీపీకి 42 శాతం ఓట్లు వచ్చాయి. 45 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆళ్ల నాని గెలిచారు. ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలో, ఉప ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.

ఇక తాజా మునిసిపల్ ఎన్నికల్లో ఏలూరు వాసులు టీడీపీ పట్ల అవిశ్వాసాన్ని చాటారు. జగన్ పట్ల అభిమానం పెంచుకున్నట్టు ఓట్ల లెక్కలు చెబుతున్నాయి. ఓటమి పాలయినప్పటికీ అనేక చోట్ల గౌరవనీయంగా ఓట్లు దక్కించుకున్న టీడీపీకి ఏలూరులో మాత్రం పరువు బజారుపాలయ్యింది. ఆపార్టీకి మూడో వంతు ఓట్లు కూడా దక్కలేదు. మొత్తం ఎన్నికలు జరిగిన 47 డివిజన్లలో కలిపి అధికార వైఎస్సార్సీపీకి 74,854 ఓట్లు దక్కాయి,. అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో ఆపార్టీ బలం 45 శాతం నుంచి 56.43 శాతానికి పెరిగింది.

అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు దక్కించుకున్న టీడీపీ ఈసారి కేవలం 28.2 శాతం ఓట్లకే పరిమితం అయ్యింది. ఆ తద్వారా ఆపార్టీకి ఏకంగా 50 శాతం బలం కుచించుకుపోయింది. ఇది తెలుగు దేశం వర్గాలను కలవరపరుస్తోంది. టీడీపీకి కేవలం 37,414 మాత్రమే పడ్డాయి. వైఎస్సార్సీపీకి పడిన ఓట్లలో దాదాపు సగం మాత్రమే సైకిల్ కి చేరాయంటే టీడీపీ ఎంత పతనావస్థలో ఉందో స్పష్టమవుతోంది.

వాస్తవానికి టీడీపీకి అంతో ఇంతో అనుకూలత, పచ్చ మీడియా ప్రభావం వంటివన్నీ నగరాలు, పట్టణ ఓటర్లలోనే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అర్బన్ ఏరియాలోనే అంతో ఇంతో గెలిచింది. కానీ ఈసారి అర్బన్ ఓటర్లలో కూడా టీడీపీకి అనాదరణ పెరగడం గమనిస్తే ఇక టీడీపీ భవిష్యత్తు పూర్తి ప్రమాదంలో పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఇక పల్లె పోరు బ్యాలెట్ బ్యాక్సులు తెరిస్తే టీడీపీ కోటలన్నీ బద్దలయిపోయే ప్రమాదం ఉన్నట్టు లెక్కలేస్తున్నారు. ఇది టీడీపీని తీవ్రంగా కలచివేసే వాస్తవంలా కనిపిస్తోంది.

Also Read : ఏలూరు కార్పొరేషన్ - వైసీపీ భారీ విజయం ,మూడు డివిజన్లకే పరిమితమైన టీడీపీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp