ఎన్నికలుంటేనే ఉచితంగా ఇస్తారా?!

By Jaswanth.T Oct. 24, 2020, 12:15 pm IST
ఎన్నికలుంటేనే ఉచితంగా ఇస్తారా?!

ఎవరెన్ని కబుర్లుచెప్పినా ఎన్నికలు, ఓటర్లు, అధికారం చుట్టూనే రాజకీయ పార్టీలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇందుకు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనే భేదభావమేమీ లేదన్నది బీహార్‌ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీతో తేలిపోయింది. అప్రతిహతమైన మెజార్టీని ఇచ్చిన దేశ ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మాత్రమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు రేకెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ బీహార్‌ మేనిఫెస్టో పట్ల తమ అసంతృప్తిని చాలా మంది వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సమాక్య స్ఫూర్తి నిలబెట్టేందుకు రాష్ట్రాలు కలిసి రావాలి అంటూ తరచుగా ప్రధానమంత్రి నోటి నుంటి వింటూ ఉంటాం. అయితే బీహార్‌ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ హామీ సమైక్య స్పూర్తిగానే భావించాలా? అన్న ప్రశ్నకు బీజేపీ నాయకులు ఇప్పుడు దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ పథకాల్లో కేంద్ర వాటా కూడా ఉందంటూ పోరాటానికి సిద్ధపడే ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా దీనిపై పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్నికలు ఉంటేనే ఉచితంగా ఇస్తారా? అంటూ ప్రజల నుంచి సూటిగా వచ్చిపడే ప్రశ్నకు సమాధానం చెప్పుకునేందుకు సిద్ధపడాల్సిందే.

తమకు ఏదో చేస్తారన్న కొండంత నమ్మకంతో మాత్రమే బీజేపీకి దేశ ప్రజలు పట్టం గట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి భిన్నంగా తాము కూడా ఇతర పార్టీల మాదిరిగానే ఓటు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతాము అన్నధోరణిలోనే ఆ పార్టీ వ్యవహారాలు కొనసాగితే మాత్రం జనం వ్యతిరేకతను చవిచూడడం తప్పకపోవచ్చు. ఇప్పటి ఎన్టీయే కూటమిలోనుంచి రెండు మిత్ర పక్షాలు విడిపోయాయి. ఆ రెండు పార్టీల సొంత అజెండాలు వారికి ఉండొచ్చు.

కానీ శతృదుర్భేధ్యంగా భావిస్తున్న బీజేపీ కోట నుంచి ఇద్దరు అసంతృప్తితో బైటకు వచ్చేసారు? అన్న విషయం జనంలోకైతే బలంగానే వెళుతోంది. అక్కడ ఏదో జరుగుతోందన్న సంశయం అయితే జనంలో అప్పుడే మొదలైంది. మరోపక్క కోవిడ్‌ను ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వం స్వయం శక్తి ఎంత వరకు అన్న ప్రశ్న కూడా జోరుగానే విన్పిస్తోంది. మాస్కులు, సామాజిక దూరం గురించిప్రధానే స్వయంగా చెప్పడం చూస్తుంటే మీ మాస్కులు మీరు పెట్టుకోండి, మీకు మీరే దూరందూరంగా ఉండడం, మేం ఇంతకంటే ఏమీ చేయలేం అన్నరీతిలోనే కేంద్రం వ్యవహారాలు సాగుతున్నాయన్న ఆరోపణలు జోరందుకున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని, అక్కడ మాత్రమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితం అన్న రీతిలో హామీలు గుప్పించడం, ఇతర చోట్ల బీజేపీకి ఎదురుగాలి వీచేందుకు సిద్ధపరుస్తుందన్న విశ్లేషణ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ముప్పైకోట్ల మందికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ స్వయంగానే ప్రకటించారు. ఈ ముప్పైకోట్ల మంది దేశ వ్యాప్తంగానే ఉంటారనడంలో ఎటువంటి సదేహం లేదు. అయితే బీహార్‌లో ఇచ్చిన ఉచిత హామీని బేస్‌చేసుకుని బీజేపీయేతర పార్టీలన్నీ దేశ వ్యాప్తంగా విమర్శనాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు షా, మోడీ ద్వయం ఏం పాచికలు సిద్ధం చేస్తారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp