యూపీలో పొత్తులు.. ప్రచార ఎత్తులు

By Ramana.Damara Singh Jul. 28, 2021, 08:00 pm IST
యూపీలో పొత్తులు.. ప్రచార ఎత్తులు

వచ్చే మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. నేతల పర్యటనలు ఒకవైపు.. పొత్తుల చర్చలు మరోవైపు.. ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకోవడం మరోవైపు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి తొలి పొత్తు సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మధ్య కుదిరింది. కాగా పార్టీలు ప్రచారానికి కూడా తెర తీస్తున్నాయి. అధికార బీజేపీ తన ఎన్నికల నినాదాన్ని కూడా ఖరారు చేసింది. మిగిలిన పార్టీలు కూడా ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఎస్పీ-ఎన్సీపీ మధ్య పొత్తు

యూపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగి అదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అయితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగే స్థితిలో ప్రతిపక్షాలు లేవు. దాంతో బీఎస్పీ తప్ప అన్ని పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి. కలిసి వచ్చే పార్టీల కోసం ఎదురుచూస్తున్నాయి. బీఎస్పీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు కాంగ్రెసుతో పొత్తుకు ససేమిరా అన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా ఎన్సీపీతో ఎన్నికల పొత్తుకు సిద్ధమయ్యారు. బీజేపీని ఒంటరిగా ఢీకొట్టడం కంటే ఐక్యంగా ఎదుర్కొంటేనే పడగొట్టగలమని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో జరిపిన ఫోన్ చర్చల ద్వారా పొత్తు కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన పవార్.. భావసారూప్యత కలిగిన మరికొన్ని పార్టీలతోనూ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే పార్టీలతో జత కట్టేందుకు ప్రయత్నిస్తోంది. తనతో పొత్తుకు సమాజ్వాదీ పార్టీ నిరాకరించడం, బీఎస్పీ ఒంటరి పోటీకి సిద్ధపడటంతో.. ఇతర చిన్న చిన్న పార్టీల వైపు కాంగ్రెస్ దృష్టి సారించింది.

సిద్ధం అవుతున్న ప్రచారాస్త్రాలు

ఒకవైపు పొత్తుల చర్చలు సాగిస్తూనే మరోవైపు ప్రచారాస్త్రాలకు అన్ని పార్టీలు పదును పెడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకొని, ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగే ఎన్నికల నినాదాలు, అంశాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ బీజేపీ తరఫున ఎన్నికల నినాదాన్ని ఖరారు చేశారు. 'అభివృద్ధి.. విశ్వసనీయత' తమ నినాదామని ఆయన ప్రకటించారు. కరోనాను పూర్తిగా అంతం చేయడం, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, మాఫియాపై ఉక్కుపాదం మోపడం ఇతర ప్రచారాంశాలుగా ఉంటాయన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచార నినాదాలుగా చేసుకోవాలని నిర్ణయించింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు బ్రాహ్మణ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దశల వారీగా అన్ని జిల్లాల్లో బ్రాహ్మణ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీనే నమ్ముకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకను యూపీ ఎన్నికల ఇంఛార్జిగా నియమించింది. ఆ మేరకు ఆమె ఇప్పటికే రంగంలోకి దిగారు. గత వారంలో మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి పలు వర్గాలను కలుసుకున్నారు. ఆమె లక్నోలోనే మకాం వేసి కాంగ్రెస్ ఎన్నికల రథాన్ని నడపనున్నారు.

Also Read : ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరుతారా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp