దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏక్‌నాథ్ ఖడ్సే

By Srinivas Racharla Oct. 21, 2020, 10:13 pm IST
దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏక్‌నాథ్ ఖడ్సే

కాలం కలిసి రాకపోతే మిత్రులు దూరం అవుతారు అనే విషయం 'మహా' అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపికి బాగా అర్థమైంది. మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షం శివసేన తమతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం బిజెపి కలలో కూడా ఊహించని పరిణామం. కాగా ఆ షాక్ నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బిజెపికి సీనియర్ నేత, మాజీ మంత్రి నిర్ణయంతో మరో ఎదురు దెబ్బ తగిలింది.

మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు.ఇవాళ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఏక్‌నాథ్ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన రాజకీయ జీవితాన్ని ఫడ్నవీస్ నాశనం చేశాడని మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించిన తర్వాత పార్టీకి కూడా దూరం చేయాలని ప్రయత్నించాడని ఏక్‌నాథ్ ఆరోపించాడు. 2016 నుంచి నాలుగేళ్లగా తాను తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఖడ్సే పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంపాటు బీజేపీతో గల తన అనుబంధాన్ని తెంచుకోవడానికి మాజీ సీఎం ఫడ్నవీస్‌యే కారణం అని ఆయన ప్రకటించడం గమనార్హం. బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పడం బాధాకరం అయినప్పటికీ తనకు అంతకుమించిన గత్యంతరం లేక పోయిందని ఖడ్సే చెప్పుకొచ్చాడు.ఇక తనను రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు చివరకు రేప్ కేసులో ఇరికించేందుకు కూడా ఫడ్నవీస్ ప్రయత్నించాడని ధ్వజం ఎత్తాడు.

ఎన్సీపీ గూటికి చేరనున్న ఏక్‌నాథ్

2014 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఫడ్నవీస్‌తో ఏక్‌నాథ్ ఖడ్సే పోటీ పడ్డాడు. కానీ ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకులకు అత్యంత సన్నిహితుడు కావడంతో దేవేంద్ర ఫడ్నవీస్‌ని ముఖ్యమంత్రి పీఠం వరించింది. నాడు ఇరువురు నేతల మధ్య ఏర్పడిన విభేదాలు 2016లో అవినీతి ఆరోపణలతో ఏక్‌నాథ్ ఖడ్సేని తన క్యాబినెట్ నుండి ఫడ్నవీస్‌ తొలగించడంతో తీవ్ర రూపం దాల్చాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముక్తయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు బదులుగా కుమార్తె రోహిణీ ఖడ్సే ను పోటీకి దించారు.అయితే స్వతంత్ర అభ్యర్థి చంద్రకాంత్ నింబా పాటిల్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.తన కుమార్తె ఓటమికి దేవేంద్ర ఫడ్నవిస్ కుట్రపన్ని స్వతంత్ర అభ్యర్థికి లోపాయకారిగా సహకరించాడని భావించిన ఏక్‌నాథ్ ఖడ్సే అసంతృప్తికి గురయ్యాడు.నాటి నుంచి ఆయన బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో గల రాజకీయ వైరం కారణంగా బీజేపీకి రాజీనామా చేసిన ఏకనాథ్ ఖడ్సే ఎన్సీపీ గూటికి చేరనున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమక్షంలో ఏక్‌నాథ్ ఖడ్సే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు.కాగా ఆయన సేవలను బీజేపీ గుర్తించలేదని,ఆయన సేవలను గుర్తించే పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఖడ్సే నిర్ణయాన్ని పవార్ సమర్థించారు.

త్వరలో మరికొందరు బిజెపి సీనియర్ నేతలు కూడా ఆ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాస్తవ రూపం దాలిస్తే త్వరలో ఆ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతున్న బీజేపీకి ఈ పరిణామం ఆశనిపాతంగా మారే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp