సీనియర్లకు కళా ఎసరు?

By Ramana.Damara Singh Apr. 20, 2021, 09:00 am IST
సీనియర్లకు కళా ఎసరు?

గత నెలలో బాలబొమ్మ వెంకటేశ్వరరావు, తాజాగా కలిశెట్టి అప్పలనాయుడు.. టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అధికార దర్పానికి వరుసగా సీనియర్ నేతలు బలవుతున్నారు. తనను ప్రశ్నించేవారిని, తనకు వ్యతిరేకంగా ఉన్నారన్న అనుమానం ఉన్న వారిని సస్పెన్షన్ల పేరుతో కళా సాగనంపుతుండటం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. నేతల సస్పెన్షన్లకు చూపుతున్న కారణాలు కూడా కళా వైఖరినే తప్పు పడుతున్నాయి. గత రెండేళ్లుగా కళా తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎచ్చెర్ల టీడీపీ నేతలు తాజా పరిణామాలతో మరింత రగిలిపోతున్నారు.

కలిశెట్టిపై సస్పెన్షన్ వేటు

ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు సొంత అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కళా వెంకటరావు ప్రకటించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం పేరుతో విషయం చెప్పకుండానే కొందరు నేతలను పిలిపించి కొద్దిసేపు ఇతర విషయాలు మాట్లాడిన ఆయన.. చివరిలో సస్పెన్షన్ విషయం ప్రకటించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతినాడు, పార్టీ వార్షికోత్సవం రోజు కలిశెట్టి పార్టీని సంప్రదించకుండా సేవా కార్యక్రమాలు చేపట్టారని.. దీన్ని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే వెళ్లిపోయారు. దాంతో అక్కడున్న నాయకులు అవాక్కయ్యారు. గతనెలలో ఇలాగే జి.సిగడాం మండల సీనియర్ నేత బాలబొమ్మ వెంకటేశ్వరరావును సర్పంచ్ అభ్యర్థిని పోటీకి పెట్టలేదన్న సాకుతో సస్పెండ్ చేయడం.. కళా తీరును ఎండగడుతూ ఆయన విడుదల చేసిన ఆడియో కలకలం రేపిన విషయం మరచిపోకముందే కలిశెట్టిని కళా టార్గెట్ చేయడం ఎచ్చెర్ల పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం రగిలించింది.

ఏ అధికారంతో సస్పెండ్ చేశారు?

టీడీపీ ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరాల డైరెక్టర్ గా, హెచ్ఆర్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కురుపాం నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్న అప్పలనాయుడును సస్పెండ్ చేసే అధికారం కళాకు ఎక్కడుందని పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఆయనపై ఏవైనా ఆరోపణలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప తూతూ మంత్రంగా సమావేశం పెట్టి.. సభ్యులతో చర్చించకుండా, షోకాజ్ నోటీసులు జారీచేయకుండా ఏకంగా సస్పెండ్ చేయడమేమిటని నిలదీస్తున్నారు. కలిశెట్టిని సస్పెండ్ చేశారని తెలిసిన వెంటనే పలువురు ముఖ్యనేతలు సమావేశమై దీనిపై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు లేదంటే
ప్రధాన కార్యాదర్శి తీసుకోవాల్సిన నిర్ణయాలను
కళా తీసుకోవడం చెల్లదని స్పష్టం చేశారు.

ఇదే కళా సొంత అజెండా..

వాస్తవానికి కళా వెంకట్రావ్ సొంత ఎజెండాతో ఎచ్చెర్లలో టీడీపీకి ఉనికి లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. రాజాం నియోజకవర్గానికి చెందిన కళా కుటుంబం ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలపై స్వారీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుకు ఎచ్చెర్ల కోటాలో రాష్ట్ర కార్యదర్శి పదవి ఇప్పించుకొని ఎచ్చెర్ల పెత్తనం అప్పగించారని.. దాన్ని వ్యతిరేకించిన నేతలను, పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తన మేనల్లుడు జడ్డు విష్ణు ద్వారా కాంట్రాక్టుల పేరుతో చేస్తున్న అవినీతిని ప్రశ్నించిన పాపానికి బాలబొమ్మ వెంకటేశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడు లాంటి నేతలను ఏకపక్షంగా సస్పెండు చేశారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ పరిస్థితుల్లో సీనియర్లను బలిచేస్తే పార్టీ ఉనికి పూర్తిగా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కళాను అదుపులో పెట్టి ఎచ్చెర్లలో పార్టీని రక్షించాలని ఆ ఫిర్యాదు పత్రంలో కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp