కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకునే వారికి హెచ్చరికలు.. ఏపీలో హెల్ప్ లైన్ నంబర్

By Voleti Divakar Aug. 05, 2020, 09:38 pm IST
కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకునే వారికి హెచ్చరికలు.. ఏపీలో  హెల్ప్ లైన్ నంబర్

కరోనాతో మృతి చెందిన రోగుల పట్ల అంత నిర్దయగా వ్యవహరించాల్సిన అవసరం వైద్య నిపుణులు, భారతీయ వైద్య పరిశోధన మండలి స్పష్టం చేస్తున్నా ప్రజల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కరోనా వైరస్ మృతుల భౌతికకాయలపై 6 గంటలకు మించి ఉండదని వైద్యనిపుణులు, ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దహనం చేసిన మృతదేహానికి సంబంధించిన వ్యర్థాల్లోనూ వైరస్ ఉండదని తేల్చి చెబుతున్నారు. మృతదేహాన్ని కనీసం ఐదడుగుల లోతులో ఖననం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలతో మృతదేహాన్నిముట్టుకున్నా వైరస్ వ్యాప్తి చెందదని, అయితే 6 గంటల్లోగా భౌతిక కాయాల నుంచి వెలువడే స్రావాలు మాత్రం నోట్లోకి, ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేస్తున్నారు.

కరోనా మృతుల పట్ల ప్రజల వైఖరిలో, భయాందోళనల్లో మార్పు లేకపోవడంతో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కరోనా మృతుల అంత్యక్రియలు, దహన సంస్కారాలను అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నెల నుంచి గరిష్టంగా 3ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు, జరిమానా విధిస్తామని తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత హెచ్చరించారు. ఈ విషయమై 15100 హెల్ప్ లైన్ నెంబరు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చట్టాలకు ప్రచారం కల్పిస్తే ప్రజలు భయపడి, కరోనా మృతుల పట్ల కాస్త కనికరం చూపించే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడంతో పాటు, మానవత్వాన్ని మంటగలుపుతోంది. కరోనా వైరస్ ముందు బంధాలు...బంధుత్వాలు కూడా దిగదుడుపుగానే మారాయి. కరోనా రక్కసి దేశంలోకి ప్రవేశించాక వైరస్ గురించి రోజుకో వార్త, పుకారు ప్రచారంలోకి వస్తోంది. దీంతో ప్రజలు కరోనా అంటేనే హడలిపోతున్నారు. కరోనా సోకిన సొంత తల్లిదండ్రులు, సోదరులను కూడా రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి...కనిపిస్తున్నాయి.

కరోనాతో మృతి చెందిన రోగుల పట్ల మరింత నిర్దయగా వ్యవహరిస్తూ అంతిమ సంస్కారాలను కూడా అడ్డుకున్న ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. అందరూ ఉన్నా అనాధలుగా, అంత్యంత దయనీయంగా వారి అంత్యక్రియలు జరగడం మానత్వపు విలువలను దిగజారుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజల ఆలోచనలు, చేతల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp