తెలంగాణ‌లో ఇక‌ ఈ-ఆఫీస్ పాల‌న : ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

By Kalyan.S Jul. 07, 2020, 08:00 am IST
తెలంగాణ‌లో ఇక‌ ఈ-ఆఫీస్ పాల‌న : ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఆస్ప‌త్రులు, పోలీసు స్టేష‌న్లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాలు, స‌చివాల‌యం, మునిసిప‌ల్ స‌ర్కిల్ కార్యాయాలు... ఇలా ఎక్క‌డ చూసినా క‌రోనా క‌ల‌క‌లమే రేగుతోంది. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌చివాల‌యంతో పాటు... ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ తీసుకురానుంది. దీని ద్వారా సుల‌భ‌త‌ర పాల‌న చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే చాలా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో 50 : 50 నిష్ప‌త్తిలో ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. సంద‌ర్శ‌కులు ఎవ‌రూ కార్యాల‌యాల‌కు రాకుండా .. ఆన్ లైన్ లోనే ఫిర్యాదులు తీసుకునేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇప్పుడు ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా అవ‌స‌ర‌మైతే.. ఇంటి నుంచి కూడా ప‌నులు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వారం ప‌ది రోజుల్లో.. ఈ ఆఫీస్ ప‌రిపాల‌న‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే.. ఉద్యోగుల‌కు సంబంధించిన మాస్ట‌ర్ డేటాబేస్ రూపొందించాల‌ని ప్ర‌భుత్వం ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఉద్యోగుల‌కు త్వ‌ర‌లోనే శిక్ష‌ణ కూడా ఇవ్వ‌నుంది.

25 వేలు దాటిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికే ఏకంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలు దాటేసింది. వైద్య ఆరోగ్య శాఖ సోమ‌వారం విడుద‌ల చేసిన బులెటిన్ ప్ర‌కారం.. 25, 733 కేసులు ఇప్ప‌టి వ‌ర‌కూ న‌మోదు అయ్యాయి. వాటిలో యాక్టివ్ కేసులు 11 వేల వ‌ర‌కూ ఉన్నాయి. వేల‌ల్లో పెరుగుతున్న ఈ కేసుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు జారీ చేసింది. కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70 నుంచి 80 శాతం వరకూ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్యులు, నటులు సైతం ఈ వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp